జీ సినీ అవార్డుల ప్రదానోత్సవం ముంబయిలోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా కరోనా ఆందోళన నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సాధారణ వ్యక్తులను ఎవరినీ అనుమతించలేదు. ఆడియన్స్ లేకుండానే జీ సినీ అవార్డుల కార్యక్రమం ముగిసింది. అభిమానులు మార్చి 28న ఈ కార్యక్రమాన్ని వీక్షించొచ్చని నిర్వాహకులు వెల్లడించారు. ‘అవార్డుల ఫంక్షన్‌కు హాజరు కావడానికి టికెట్లు తీసుకున్న వారికి త్వరలోనే డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు.
కరోనా వైరస్ కారణంగా దేశంలో అనేక వినోదాత్మక కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేయకుండా ఆడియన్స్ లేకుండానే నిర్వహించేశారు. హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్, సారా అలీ ఖాన్, తాప్సి, రకుల్‌ప్రీత్ సింగ్, రాజ్‌కుమార్ రావ్, అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్, అపర్‌శక్తి ఖురానా, గోవింద తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. రాజ్‌కుమార్, అపర్‌శక్తి, కార్తిక్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. హృతిక్, రణ్‌వీర్, సారా తదితరులు వేదికపై డ్యాన్స్ చేసి ఉత్సాహం నింపారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ 3 అవార్డులు గెలుచుకున్నారు. ‘గల్లీబాయ్’ సినిమాకు ఉత్తమ నటుడు, సాంగ్ ఆఫ్ ది ఇయర్, వెండితెర ఉత్తమ జోడీ (రణ్‌వీర్, అలియా భట్) విభాగాల్లో అవార్డులు అందుకున్నట్లు ఆయన సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు అవార్డులతో దిగిన ఫొటోను షేర్ చేశారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ‘బద్లా’ సినిమాకుగానూ ఉత్తమ నటిగా హీరోయిన్ తాప్సి అవార్డు అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పంచుకున్నారు. ‘పతి పత్ని ఔర్ ఓ’ సినిమాలో ఉత్తమ కమెడియన్‌గా కార్తిక్ ఆర్యన్ అవార్డు గెలుచుకున్నారు.