YSRCP: చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయానందరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే విజయానందరెడ్డికి సీటు కేటాయిచడంపై పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. కారు డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన విజయానందరెడ్డి ఇప్పుడు ఎర్ర చందనం స్మగ్లర్‌గా వందల కోట్లు కూడబెట్టారు. వైసీపీకి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసే స్మ్గగ్లర్‌గా కూడా ఆయనకు పేరు ఉంది.
మొదటి నుంచీ వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగి వున్న విజయానందరెడ్డి వైఎస్ జగన్‌ని కూడా మెప్పించారు. అందుకే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవగానే విజయానందరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు బలిజ నేతను పక్కన పెట్టి విజయానంద రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు.
విజయానందరెడ్డిపై పదుల సంఖ్యలో ఎర్రచందనం కేసులు ఉన్నాయి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 2014లో విజయానందరెడ్డిపై పీడీ చట్టం కూడా ప్రయోగించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో వ్యాపార భాగస్వామిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఆయన బాగోగులు చూసుకున్నారని, రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ ఆయనను పరామర్శించారని ఆరోపణలున్నాయి.
జగన్ కూడా ఓసారి విజయానందరెడ్డి ఇంటికి వెళ్లి ఆయన ఆతిథ్యం స్వీకరించారని, క్రిమినల్స్ కు వైసీపీలో పెద్ద పీట వేస్తారనేదానికి ఇదో ఉదాహరణ అని అంటున్నారు. చిత్తూరు అంటే సాక్షాత్తూ తిరుమల వెంకన్న వెలిసిన ప్రాంతం. అలాగే ఈ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న చిత్తూరు జిల్లాలో ఓ స్మగ్లర్‌ను పోటీలో నిలబెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇటువంటి వాళ్లకు ఎన్నికల్లో ప్రజలే సరైన సమాధానం చెప్పాలని అంటున్నారు. స్మగ్లర్లను, దోపిడీ దొంగలను గెలిపిస్తే మన భావి తరాల భవిష్యత్ ఎలా ఉంటుందోనని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. నాయకుడంటే ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలని, యువతకు మార్గదర్శకుడిగా ఉండాలని అలాంటి వారిని మాత్రమే గెలిపించుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందని అంటున్నారు.