Ys Vijayamma: ఏపీ ఎన్నికలలో జగన్ – షర్మిల ప్రత్యర్థులుగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. వైయస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నారు. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలి గా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే వారి తల్లి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించడంతో.. ఆమె వెంట వైయస్ విజయమ్మ నడిచారు. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలి గా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. ప్రత్యర్థులుగా మారిన ఈ ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నారు.
ఈక్రమంలో కుమార్తెకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే.. కుమారుడికి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కుమారుడికి కన్నతల్లిగా మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే.. కుమార్తెకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైయస్ విజయమ్మ ఓ విధమైన ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితల మధ్య విజయమ్మ ఫారన్ టూర్ ప్లాన్ చేసుకొని ఆమె వెళ్లిపోయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే విజమ్మను జగన్ కావాలనే విదేశాలకు పంపించారు అనే టాక్ కూడా ఉంది.
అంతేకాక మార్చిలో సీఎం వైయస్ జగన్ మేము సిద్దం పేరిట ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర చేపట్టారు. ఆ సమయంలో కన్నతల్లి వైయస్ విజయమ్మ నుంచి ఆశీర్వాదం తీసుకొని వైయస్ జగన్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. దాంతో వైయస్ విజయమ్మ కుమారుడు జగన్‌తోనే ఉన్నారనే అనుకుంటున్నారు.
మరోవైపు వైయస్ షర్మిల సైతం ఎన్నికల ప్రచారానికి వెళ్తుంటే.. బొట్టు పెట్టి మరీ ఆమెను ఆశీర్వదించారీ వైయస్ విజయమ్మ. దీంతో వైయస్ విజయమ్మ వ్యవహార శైలికి ఎవరికీ అంతుబట్టని విధంగా తయారైంది. అంటే తల్లిగా వైయస్ విజయమ్మ.. జగన్ వైపు ఉంటుందా.. లేక షర్మిల వైపు ఉంటుందా అనే సందిగ్దంలోకి ఏపీ ప్రజలు ఉన్నారు.