YS Sunitha: అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మాట్లాడారు. వైఎస్ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు సీఎం జగన్, వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందన్నారు.
తప్పును గ్రహించానని.. దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని చెప్పారు. ప్రజలంతా గ్రహిస్తున్నారని.. వాస్తవాలేంటో వారికి తెలుసు. హైదరాబాద్, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా.. సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరైనా ఒకసారి మోసం చేయొచ్చు… పదేపదే మోసం చేయలేరని అన్నారు. వివేకా హత్య గురించి ఒక అన్నగా తనకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదని… సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని సునీత అన్నారు. అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలని… లేకపోతే పాపం చుట్టుకుంటుందని చెప్పారు. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దని, ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని అన్నారు. అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి.
ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే.. ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంతభయం దేనికి?నేరుగా మాట్లాడాలంటే చెప్పండి. నాకు అభ్యంతరం లేదు.. మీ ఛానల్‌కి వస్తా.. డిబేట్ చేద్దాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు” అని సునీత వ్యాఖ్యానించారు. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామని… వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని అన్నారు.