AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేడి మరింత రంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీల మధ్య పోటీ మరింత హాట్ హాట్‌గా మారుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఓవైపు చంద్రబాబు, మరోవైపు జగన్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న వైఎస్ షర్మిల అరకు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌పై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలుచేశారు.
ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వేసిన రోడ్లే తప్ప ఎక్కడన్నా అభివృద్ధి ఉందా అని షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టిపోసిన జగన్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లయినా ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీకి జీవనాడి లాంటి ప్రత్యేక హోదాను అటు చంద్రబాబు, ఇటు జగన్ కూడా మరిచిపోయారని విమర్శించారు. పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు ఇప్పుడు దానిగురించి మాట్లాడటం లేదని.. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేశాడని అధికారంలోకి వచ్చాక దాని ఊసే మరిచిపోయారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా ఉంటేనే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని.. దానివల్ల మన యువతకు ఉద్యోగాలు వస్తాయని.. అసలు పరిశ్రమలే రాకుంటే యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతుంటే ఏపీ యువత లేని రాష్ట్రంగా మిగిలిపోతుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్ ఐదేళ్ల క్రితం చెప్పాడు.. అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామన్న జగన్ ఈ ఐదేళ్లు ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. ఐదేళ్ల పాటు జగన్ గాడిదలను కాశారా.. గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా అంటూ తీవ్ర స్థాయితో ధ్వజమెత్తారు.
ఏపీలో 23 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఐదేళ్ల క్రితం జగన్ చెప్పారు. 23 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నారని ఆరోజు చంద్రబాబును జగన్ తిట్టిపోశారు.. మరి జగన్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఏం చేశారు? 23 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎప్పుడూ నోటిఫికేషన్ వేయలేదు. ఆఖరులో ఎలక్షన్ మరో 2 నెలలు ఉందనగా 6 వేల పోస్టులకు దగా డీఎస్సీ ప్రకటించారు. ఎన్నికలకు 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే పరీక్షలు ఎప్పుడు జరగాలి, పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలని అది అయ్యేదిలేదు.. చచ్చేది లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం కుంభకర్ణుడు 6 నెలలకైనా నిద్ర లేస్తాడు.. కానీ జగన్ మాత్రం ఐదేళ్లూ నిద్రపోయారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రజల గురించి ఆలోచించింది ఎప్పుడు.. ప్రజల మధ్యకు వచ్చింది ఎప్పుడు అంటూ.. వీళ్లా రాజశేఖర్ రెడ్డిగారి ఆశయాలు నిలబెట్టేది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లలో ప్రజల అవసరాలు ఏమిటి అని జగన్ ఆలోచించలేదు. వైఎస్‌ఆర్ ప్రజల మధ్యకు వచ్చి వేలాది మంది ప్రజలను కలుసుకున్నారు. అలాంటిది వైఎస్ఆర్ కొడుకు అయివుండి జగన్ ఒక్కసారైనా ఐదేళ్లలో ప్రజల మధ్యకు వచ్చారా.. ప్రజలకు కాదు కదా.. ఎమ్మెల్యేలకు, మంత్రులకూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఐదేళ్ల క్రితం జగన్ మైకు పట్టుకుని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చాడు.. మరి చేశాడా.. మద్య నిషేధం కాదు కదా.. ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుందంటూ షర్మిల విమర్శించారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతోందని, లివర్, కిడ్నీలు చెడిపోయి రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్నారని తీవ్ర స్థాయిలో షర్మిల దుమ్మెత్తిపోశారు.