ఏపీ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించేందుకు వైఎస్ షర్మిల శాయశక్తులా కృషిచేస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ నేతల్లో జోష్ పెంచింది. అధికార పార్టీని టార్గెట్ చేస్తూ తన సొంత అన్నపై తీవ్రంగా విమర్శల బాణాల వర్షం కురిపిస్తోంది. వైసీపీ నేతలను సైతం దుయ్యబడుతోంది. ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఏపీలో జగన్ చేస్తున్నది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన కాదని ఇప్పటికే జగన్‌పై తీవ్రంగా విమర్శించింది షర్మిల. జగన్‌కు వైఎస్‌ఆర్‌కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని దుయ్యబట్టింది. వైసీపీ పార్టీ కోసం తాను ఎంతగానో కృషి చేశానని, జగన్ అధికారంలోకి రావడానికి పార్టీని తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపించానని అన్నారు. అధికారంలోకి వచ్చాక జగన్ పూర్తిగా మారిపోయారని, తనను పట్టించుకోకపోయినా ఏపీలో ప్రజల కోసం రాజన్న పాలన అందిస్తారని ఆశించానని అన్నారు.
వైఎస్‌ఆర్‌కు తానే నిజమైన వారసురాలని షర్మిల చెబుతోంది. అధికారంలోకి రాకముందు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశాడని, ఆ తర్వాత ఆ విషయాన్నే మరిచిపోయాడని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అలాగే విభజన హామీలు అమలు చేయాలని వైఎస్ షర్మిల ఢిల్లీలోని ఏపీ భవన్‌లోని గాంధీజీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేపట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామని మోదీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటివరకు విభజన హామీలను అమలు చేయని బీజేపీకి ఏపీలోని పార్టీలు ఎందుకు మద్దతిస్తున్నాయని మండిపడ్డారు.
ఢిల్లీలో పలువురు ప్రతిపక్ష నేతలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా సాధనకోసం వారి మద్దతు కూడగట్టేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక హోదా, ఏపీ విభజన హామీలపై పార్లమెంటులో లేవనెత్తాలని విపక్ష నేతలను కోరింది.