YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని.. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన వైసీపీ ఆ హామీని మరిచిందని విమర్శించారు.
ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నారని.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. లెదర్ పార్కు హామీని సైతం మరిచారని ఆరోపించారు. మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
”ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది. దానితో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. కానీ ఈ విషయంలో బీజేపీమోసం చేసింది. కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్ తాకట్టు పెట్టారు. ఒక్క సీటు లేని బీజేపేరాష్ట్రంలో రాజ్యమేలుతోంది.
ఆంధ్రప్రదేశ్ గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టించుకోవడం లేదని.. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. ఈ హామీని ఏఐసీసీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 2.25 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేస్తాం. ప్రతి మహిళ పేరు మీద రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు నిర్మిస్తాం.
వృద్ధులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ అందిస్తాం. పెద్ద కోటలు కట్టుకొని అందులో ఉండే జగన్.. ఎన్నికలు ఉన్నాయని ‘సిద్ధం’ పేరుతో బయటకు వస్తున్నారు. ఏనాడైనా ప్రజల సమస్యలను ఆయన విన్నారా ? వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేది. వారసుడి పాలనలో ఎక్కడికి పోయింది?” అని షర్మిల నిలదీశారు.