కేంద్రంలో హంగ్ వస్తుందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకమని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిన టీఆర్ఎస్, వైసీపీలు కింగ్ మేకర్లు అవుదామని కలలుగంటున్నాయి. ఈ రెండు పార్టీలు అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకి సమదూరం పాటిస్తూ ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గుచూపాయి. తటస్థంగా ఉన్న ఈ రెండు పార్టీలకు జాతీయ పార్టీలు గాలం వేస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం పోలింగ్ సరళి.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ పరిణామాలను కూడా అంచనా వేస్తూ ఎన్నికల ఫలితాల తర్వాత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయినట్టు సమాచారం. అయితే ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి జగన్ మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోపక్క కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని తన కొడుకు రాహుల్ ను ప్రధాని చేయాలని కృతనిశ్చయంతో ఉన్న సోనియాగాంధీ ఫలితాలు వెలువడే మే 23న దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటికి ఆహ్వానం పంపారు. మోడీని గద్దె దించడమే ఎజెండాగా కలిసి రావాలని కోరారు.
అయితే యూపీఏ మంచి ఆఫర్ ఇస్తున్నా కానీ జగన్ కాంగ్రెస్ కు, అటు బీజేపీకి సమదూరం పాటిస్తున్నారు. ప్రస్తుతానికి తటస్థంగానే వ్యవహరిస్తున్నారు. మే 23న ఫలితాలు వచ్చాక రంగంలోకి దిగడానికి జగన్ రెడీ అయినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో సఖ్యంగా ఉండాల్సిన అవసరాన్ని బట్టి భవిష్యత్ నిర్ణయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే దాదాపు జగన్ మొగ్గు చూపే అవకాశాలున్నాయి.