YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో విమర్శలు, ప్రతివిమర్శల హీట్ ఎక్కువైంది. ఓ వైపు ఏపీలో ఎండల వేడి.. మరోవైపు ఎన్నికల వేడితో ప్రజలు సతమతమవుతున్నారు. రాజకీయ నాయకులు పరస్పరం విమర్శల బాణాలు గుప్పిస్తున్నారు.
తాజాగా సీఎం జగన్ కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ టార్గెట్‌గా మరోసారి విమర్శల వాన కురిపించారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు. పవన్‌కు పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగు అంటూ ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ అంటూ పవన్‌పై ఆరోపణలు గుప్పించారు.
గతంలో ప్యాకేజీ స్టార్‌కు పాలకొల్లు, భీమవరం, గాజువాక 3 ఉండేవి. ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజీ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయి. చంద్రబాబు తన చంకలో ఉన్న పిల్లిని పిఠాపురంలో వదిలాడు అంటూ చంద్రబాబు, పవన్‌లపై విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం జగన్.
దత్తపుత్రుడు పవన్‌కు చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమని.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. జగన్‌ను తిట్టు అంటే తిట్టు.. కొట్టు అంటే కొట్టు.. ఇలా ఎక్కడ నిలబడితే చంద్రబాబుకు ప్రయోజనం కలుగుతుందంటే అక్కడ నిలబడతాడని పవన్‌పై విమర్శలు చేశారు. దత్తపుత్రా నీకు ఇచ్చేది 80 కాదు 20 అంటే దానికి కూడా జీహుజూర్ అంటాడు.
ఇదీ ప్యాకేజీ స్టార్ పరిస్థితి అంటూ పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు జగన్. రాష్ట్రాన్ని హోల్ సేల్‌గా దోచుకునేందుకు, దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. కులాన్ని హోల్ సేల్‌గా చంద్రబాబుకి అమ్మేయగలను అనే భ్రమతో ప్యాకేజీ స్టార్ రాజకీయం చేస్తున్నాడని అన్నారు.
ప్యాకేజీ స్టార్‌కు రాష్ట్రం అంటే ఎంతో చులకన… జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోతాడు అంటూ విమర్శించారు. దోచుకోవడం, పంచుకోవడం చంద్రబాబు నైజమని.. వాళ్లు గెలిస్తే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుందని, ఐదేళ్లు రక్తం తాగుతారని సీఎం జగన్ ఆరోపించారు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయించారని జగన్ అన్నారు.
దత్తపుత్రుడే కాదు వదినమ్మ కూడా చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటున్నారని విమర్శించారు. మరిది మాటే వేదం అన్నట్లుగా చంద్రబాబు చెప్పినట్లుగా బీజేపీలో టికెట్లు ఇస్తుందని, అలాగే పార్టీలు మారుస్తుందని విమర్శించారు. బీఫామ్ ఏ పార్టీదైనా యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే అంటూ ఘాటు విమర్శలు చేశారు జగన్. ఎన్నికల తర్వాత చంద్రబాబు మ్యానిఫెస్టో కనిపించదని.. చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఏ మంచీ లేకపోవడంతో చివరకు కూటమి తనపై గులకరాళ్లు వేయిస్తోందని జగన్ ఆరోపణలు గుప్పించారు.