YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఈ వేసవిలో ఎన్నడూ లేనంత ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతేకాదు ఈసారి ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికార, ప్రతిపక్షాల ప్రచార హోరు ఆకాశాన్నంటేలా ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలు, ప్రతిహామీలు, వాగ్దానాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీలోని వాతావరణం వేడెక్కిపోతోంది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నేతలందరూ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు రానున్న నేపథ్యంలో పార్టీల అధినేతలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశాయి. ముఖ్యంగా అధికార వైసీపీ మేనిఫెస్టో కోసం సామాన్యులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఆతృతగా ఎదురు చూశారు.
ఇదే సమయంలో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల జాప్యం కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల పేరిట జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. ఈసారి అంతకు మించి ఉంటుందని అంతా భావించారు. అయితే గత ఐదేళ్లుగా అమలు చేస్తోన్న నవరత్నాలను మరింత మెరుగ్గా అమలు చేస్తామని మాత్రమే జగన్ ప్రకటించారు. గత మేనిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి చిన్న చిన్న మార్పులతో కొత్త మేనిఫెస్టోను ప్రకటించారు.
వైసీపీ మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలు, వ్యవసాయ రుణమాఫీ ఉంటుందని చాలామంది భావించారు. అయితే జగన్ వాటి ప్రస్తావనే తీసుకురాలేదు. వాస్తవానికి మేనిఫెస్టో ప్రకటనకు ముందు వైసీపీ గ్రాఫ్ ఒకలా ఉంది. కానీ ప్రకటించాక మరోలా ఉందనే మాట వినిపిస్తోంది. మేనిఫెస్టో విడుదల తర్వాత వైసీపీలోనే ఒక రకమైన చర్చ సాగుతుంది. జనం నుంచి కూడా టాక్ మారిపోయిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోపై ప్రజల స్పందన బాగుంది. జగన్ గత ఎన్నికల్లో నవరత్నాలు పేరిట ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు బాగున్నా కానీ వాటి అమలు సరిగా లేదని ఆరోపణలు ఉన్నాయి. సీఎం జగన్ కూడా బటన్ నొక్కి మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాని చెప్తున్నారు గానీ అవి లబ్దిదారులకు ఎంతవరకు అందుతున్నాయో గమనించడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
వృద్ధులు, వికలాంగులకు ప్రస్తుతం మూడు వేలు పింఛన్ ఇస్తున్నారు. జగన్ తాజాగా ప్రకటించిన మేనిఫెస్టోలో పింఛన్‌ను రూ.3,500కు పెంచుతూ పోతానని చెప్పారు. అంటే నాలుగేళ్లపాటు మూడు వేలు చొప్పున ఇచ్చి, ఆ తర్వాత ఏడాది రూ.3,250, ఐదో ఏడాది రూ.3500 ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇదే ఇప్పుడు పింఛన్‌దారుల్లో చర్చగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో 53 కార్పొరేషన్‌లు ఏర్పాటుచేశారు. ఒక్క దానికీ నిధులు కేటాయించలేదని ఆరోపణల ఉన్నాయి. తాజా మేనిఫెస్టోలో వాటిగురించి పెద్దగా పట్టించుకోలేదు.
వైసీపీ పాలనలో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తొలగించారు. జిల్లాలో అధిక సంఖ్యలో విద్యార్థులు పీజీ కోర్సులకు దూరమయ్యారు. తాజా మేనిఫెస్టోలోను దీని ప్రస్తావన లేదు. బకాయిలను చెల్లించలేదు. వైసీపీ ప్రభుత్వం ఇంటిలో ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మ ఒడి ఇస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఇంట్లోని ప్రతి విద్యార్థికి అమ్మఒడి అందిస్తామని హామీ ఇచ్చారు. దీని ప్రభావం కూడా జగన్‌పై ప్రజల్లో అసంతృప్తి ఏర్పడటానికి కారణమవుతుందని విశ్లేషకుల అంచనా.
టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం మేర పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చి వేసింది. ఐదేళ్లపాటు ప్రాజెక్ట్‌ను పెద్దగా పట్టించుకోలేదు. మరో ఐదేళ్లలో పూర్తి చేస్తామంటూ జగన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందంటూ ప్రతిపక్షాలు దెప్పి పొడుస్తున్నాయి. పోలవరంతోపాటు, అమరావతి రాజధాని ని పూర్తి చేస్తామని కూటమి ప్రకటించింది. ఈ అంశాల్లో కూటమి వైపు ప్రజలు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ చాలావరకు తగ్గిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పథకాలన్నింటికి కూడా వ్యయాన్ని పెంచడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. హార్బర్‌లు పూర్తి చేస్తామంటూ జగన్ ప్రకటించడంపై అంతా పెదవి విరుస్తున్నారు. బియ్యపుతిప్ప వద్ద హార్బర్‌కు ఇప్పటి వరకు పునాది రాయి వేయలేదు. ఆక్వా యూనివర్శిటీ తరగతులు ప్రారంభించలేదు. మెడికల్ కళాశాల అంటూ ఊదరగొట్టి కనీసం పూడిక కూడా తీయలేదు. మరో ఐదేళ్లలో వాటిని పూర్తి చేస్తామంటూ జగన్ చెప్పుకొచ్చారు. జలయజ్ఞం పూర్తిచేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు.
ఐదేళ్లలో వరి రైతులకు ఉపయోగపడే కాలువలను మరమ్మతులు చేపట్ట లేకపోయారు. బిల్లులు చెల్లించలేదు. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ లకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు వాటికి అనుమతులు మంజూరు చేయలేదు. పండ్ల తోటలకు సబ్సిడీలు అటకెక్కాయి. డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా కనుమరుగైంది. ఇలా చెబుతూ పోతే 2019లో వైసీపీ ఇచ్చిన హామీలో కొంత వరకే అమలు చేశారు. ఇళ్ళు, ఇళ్ళ స్థలాల కేటాయింపు విషయంలో లబ్ధిదారు లకు నిరాశే మిగిలింది.దీంతో వైసీపీ మేనిఫెస్టోపై విశ్వసనీయత లేదంటూ సర్వత్రా చర్చనీయాంశమైంది. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉంది. వృద్ధులకు పెన్షన్‌ను 2028 నుంచి రూ.500 పెంచుతారట.
మరోవైపు వైఎస్‌ఆర్ చేయూతను వచ్చే ఐదేళ్లు కొనసాగిస్తామని, అమ్మఒడిని మరింత పెంచుతామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు అనేక కొర్రీలు విధించిన విషయం మహిళలు మర్చిపోలేరు. మద్య నిషేధం అమలు చేస్తానని ఇచ్చిన హామీ అమలు పరచకుండా మద్యం ధరలను విపరీతంగా పెంచి నాసి రకపు మద్యాన్ని అమ్ముతూ ఎంతోమంది మహిళల ఉసురును ఈ వైసీపీ ప్రభుత్వం తీసిందని ఇప్పటికే మహిళలు ఆరోపణలు చేస్తున్నారు.
మరోవైపు అమలయ్యే హామీలు మాత్రమే జగన్ ఇచ్చారని.. చేయలేని హామీలను జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను బట్టే జగన్ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించారని వైసీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు మాదిరిగా తాము దొంగ హామీలు ఇవ్వలేదని ప్రజలు కచ్చితంగా జగన్ వైపే ఉన్నారని..అధికారంలోకి వచ్చేది తామే అని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.