వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. దీంతో సభ ప్రాంగణం ఎక్కడ చూసినా జనంతో నిండిపోయింది. సభ ప్రాంగణమంతా ప్రజలతో నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది.
సభలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ఎటువైపు కన్నెత్తి చూసినా ఖాళీ స్థలం కనిపించడం లేదు. రోడ్లపైనే కాకుండా బిల్డింగ్ లపైన కూడా ఖాళీ లేదన్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా అని అన్నారు. ప్రియతమ దివంగత నేత హయాంలో పాలన టాప్ గేర్ లో సాగితే.. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో రివర్స్ గేర్ లో పాలన సాగుతుందని ప్రజలు తమతో చెప్పారని జగన్ తెలిపారు.
జగన్ మాట్లాడుతూ.. ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చారని, రూ. 1500 కోట్లతో ఈ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ కోసం రెండు బీఆర్‌టీఎస్ రోడ్లకు అప్పట్లోనే రూ. 450 కోట్లు ఖర్చు చేశారని, కంచెరపాలెం నుంచి పెందుర్తి వరకు రోడ్లను ఆరునెలల్లో నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే అని చెప్పారు. ఆ రోడ్లలో 1.3 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే మిగిలిపోయిందని, ఇప్పటికి అది ఇంకా పూర్తి కాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో 14 చోట్ల 14 కాలనీలు వచ్చాయని, 35వేల ఇళ్లు కట్టించారన్నా అని చెప్పారు. ఆయన మరణానంతరం వచ్చిన ఈ చంద్రబాబు పాలనలో నగర అభివృద్ధి మళ్లీ రివర్స్ గేర్‌లో నడుస్తుంది అని ప్రజలు బాధ పడుతున్నారు అని జగన్ తెలిపారు.