ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై హైకోర్టులో ఈరోజు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా హైకోర్టు జగన్ తరపు న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడి జరిగిన తర్వాత పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకుండా వెంటనే విమానంలో హైదరాబాద్ ఎందుకు వచ్చారు, ఏపీ పోలీసుల విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించింది. గాయంతో హైదరాబాద్ ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పాలని ఆదేశించింది. దీనిపై జగన్ తరపు న్యాయవాది స్పందిస్తూ.. ఏపీ పోలీసుల వ్యవహార శైలి నమ్మశక్యంగా లేదని.. అందుకే జగన్ వారికి వాంగ్మూలం ఇవ్వలేదని స్పష్టం చేశారు. జగన్‌పై దాడి కేసును రాష్ట్రానికి సంబంధం లేని సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశించాలని కోరారు.
అనంతరం ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో జగన్ పోలీసులకు సహకరించడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎందుకు సహకరించడం లేదని జగన్ తరపు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. అసలు గాయంతో విమానంలో ప్రయాణించవచ్చా? లేదా? అన్న దానిపై వివరాలు తెలుసుకుని తమకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఇప్పటివరకు జరిగిన విచారణ వివరాలను సీల్డ్ కవరులో ఉంచి సమర్పించాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది