వందేళ్ల వయసులో చకాచకా వంటలు చేస్తూ యూట్యూబ్ స్టార్ అయిన కర్రె మస్తానమ్మ ఇక లేరు. 106ఏళ్ల వయసున్న మస్తానమ్మ సోమవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరుకు చెందిన మస్తానమ్మ గురించి రెండేళ్ల క్రితం వరకూ పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఆమె తన వంటలతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందారు. ఆమె చేసిన పుచ్చకాయ చికెన్‌ను యూట్యూబ్‌లో విపరీతంగా వీక్షించారు. ఎలాంటి సౌకర్యాలు లేకుండా పచ్చని చెట్టు కింద.. పొలం గట్టుపై కట్టెల పొయ్యి మీదే సంప్రదాయ వంటల్ని వండుతూ.. ఈతరానికి ఆ పదార్థాల్ని పరిచయం చేసిందీ ఈ బామ్మ. దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ మస్తానమ్మకు అభిమానులున్నారు. లండన్‌కి చెందిన బార్ క్రాఫ్ట్ అనే ఛానల్ నుంచి కొందరు వచ్చి మస్తానమ్మ జీవనశైలిని డాక్యుమెంటరీగా తీసుకుని వెళ్లారు. అంతలా గుర్తింపు పొందారు మస్తానమ్మ.
ఒకరోజు ఆమె మనవడు లక్ష్మణ్ స్నేహితుడు శ్రీనాథ్‌రెడ్డితో కలిసి బామ్మని చూడటానికి వెళ్లాడు. మనవడు వచ్చాడని తానే స్వయంగా టొమాటో కూర చేసి అన్నం వండి పెట్టింది. ఆ వయసులో ఆమె చాకు కూడా లేకుండా టొమాటోను ముక్కలుగా కోయడం, వేళ్లతో అల్లం పొట్టు తీయడం వంటివి వారికి ఆసక్తిగా అనిపించాయి. దాంతో ఆమె చేత వంటలు చేయించి యూట్యూబ్‌లో పెట్టారు. పల్లెటూరి పద్ధతితో బెండకాయ కూర చేయించి వీడియో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్ అవడంతో మస్తానమ్మ చేత వంటలు చేయించి కంట్రీ ఫుడ్స్ అనే ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. వండి వార్చడంలో ఎంతో అనుభవం ఉండటంతో పొయ్యి దగ్గర కూర్చుని చకచకా చేసేస్తుంది. ఆమె చేసిన అరవై శాకాహార, మాంసాహార వంటల్లో పుచ్చకాయ చికెన్‌కు బాగా స్పందన వచ్చింది. నెలరోజుల్లో ఆరులక్షల మంది చూశారు. అలానే బెండకాయ, బ్రెడ్ ఆమ్లెట్, రోస్టెడ్ ప్రాన్స్‌నూ ఎక్కువ మందే వీక్షించారు.
106 ఏళ్ల వయసులోనూ మస్తానమ్మకు ఎలాంటి చూపు సమస్యా లేదు. కళ్లద్దాలు పెట్టుకోకుండానే కూరగాయాలు కోసి వంటలు వండేసే వారు. మస్తానమ్మ పుట్టి పెరిగిందీ, అత్తారి ఊరు గుంటూరు జిల్లాలోని గుడివాడే. ఆమె ఆ ఊరు సరిహద్దులు దాటి బయటకు వెళ్లింది చాలా అరుదు. పదకొండేళ్ల వయసులోనే పెళ్లైంది. ఐదుగురు పిల్లలు. నలుగురు పిల్లలు అనారోగ్యంతో చనిపోతే ఒక్క కొడుకు మిగిలాడు. భర్త కూడా ఇరవైరెండేళ్లకే దూరమయ్యాడు. అప్పట్నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ కొడుకును పెంచింది. కొడుకు, కోడలు, మనుమలు ఉన్నా.. తన భర్తతో కలిసి ఒకప్పుడు ఉన్న పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉండేది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులూ, వృద్ధాప్య పింఛనుతోనే జీవితం వెళ్లదీసింది.