HomeTelugu Big Stories2016 లో యంగ్ హీరోల హవా!

2016 లో యంగ్ హీరోల హవా!

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు లిస్ట్ తీస్తే మహా అయితే అరడజను మంది ఉంటారు. వారి సినిమాలు సంవత్సరానికి ఒకటో.. రెండో.. విడుదలవుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో యువ హీరోల సినిమాలకే ఎక్కువ డిమాండ్ పెరుగుతోంది. వారి సినిమాలు కూడా కాసుల వర్షం కురిపిస్తుండడంతో నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. ఆడియన్స్ కూడా పెద్ద, చిన్న అని బేధం చూపకుండా.. సినిమా బావుందా..? లేదా..? అనే చూస్తున్నారు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే మీడియం రేంజ్ హీరోలు నాని, శర్వానంద్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, రాజ్ తరుణ్ వంటి హీరోల చేతుల్లోనే ఎక్కువ సినిమాలు ఉంటున్నాయి.

ఈ ఏడాది మొదట్లో వచ్చిన రామ్ తన ‘నేను శైలజ’ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తరువాత నటించిన ‘హైపర్’ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఎక్కువరోజులు నిలబడలేకపోయింది. సాయి ధరం తేజ్ ఈ సంవత్సరం రెండు సినిమాలు రిలీజ్ చేశాడు. ‘సుప్రీం’ సినిమా హిట్ బాట పడితే ‘తిక్క’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. శర్వానంద్ ఈ ఏడు విడుదల చేసిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమా మంచి హిట్ అందుకుంది. మరో సినిమా ‘రాజాధిరాజా’ అసలు ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు పోయిందో.. కూడా తెలియలేదు. నారా రోహిత్ వరుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఈ శుక్రవారం కూడా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమా రిలీజ్ అవుతోంది. కానీ ఈ ఏడాదిలో నారా రోహిత్ కు ఏ ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. నాగశౌర్య నటించిన ‘ఒక మనసు’ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో శౌర్యకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు.

రాజ్ తరుణ్ నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అతడి జోరుకి బ్రేక్ పడేలా చేసింది. మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసాడు. ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాడు. వరుణ్ తేజ్ ఈ సంవత్సరంలో ఏ సినిమా రిలీజ్ చేయలేదు. కానీ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నాడు. నరేశ్, సునీల్ లకు కూడా ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న హీరో ఎవరు అంటే నాని అనే చెప్పాలి. కృష్ణగాడి వీర ప్రేమ గాథ, జెంటిల్ మెన్, మజ్ను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ‘నేను లోకల్’ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కావాల్సింది కానీ వాయిదా పడింది. ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి మెప్పించాడు.

నాగచైతన్య తన ‘ప్రేమమ్’ సినిమాతో మంచి హిట్ కొట్టాడనే చెప్పాలి. ఆ తరువాత విడుదల చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ఏవరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఆ సినిమా ద్వారా చైతు యాక్షన్ సినిమాల్లో కూడా నటించగలడని నిరూపించుకున్నాడు. అల్లు శిరీష్ చాలా కాలం తరువాత నటించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో అతడికి విజయాన్ని అందించింది. నిఖిల్ ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. పెళ్ళిచూపులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్ తో ఇప్పుడు బిజీ హీరోగా మారిపోయాడు. మొత్తానికి 2016 లో ఈ యంగ్ హీరోలు తమ హవాను ఓ రేంజ్ వరకు నడిపించారు. వచ్చే ఏడాది వీరి ఖాతాల్లో మరిన్ని హిట్ సినిమాలు చేరాలని కోరుకుందాం!

Recent Articles English

Gallery

Recent Articles Telugu