Thug Life Movie: ప్రముఖ నటుడు కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘థగ్‌లైఫ్’. నాయగన్ బ్లాక్‌బస్టర్ తర్వాత దాదాపు 35ఏళ్ల అనంతరం కమల్‌హాసన్, మణిరత్నం కలిసి చేస్తున్న మూవీ ఇది. పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈసినిమాలో కమల్‌హాసన్‌తో పాటు జయంరవి, త్రిష, దుల్కర్ సల్మాన్, జోజు జార్జ్, గౌతమ్ కార్తిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్‌హాసన్ హీరోగా నటిస్తోన్న 234వ మూవీ ఇది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. జనవరిలో థగ్‌లైఫ్ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నెక్స్ట్ షెడ్యూల్‌ను సెర్బియాలో ప్రారంభం కాబోతున్నట్లు టాక్.
తాజాగా సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడు. సెట్స్‌లో అడుగుపెట్టకుముందే ఈ సినిమాకు గుడ్‌బై చెప్పాడు. థగ్ లైఫ్ నుంచి దుల్కర్ అర్థాంతరంగా తప్పుకోవడం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. డేట్స్ సర్ధుబాటుకాకపోవడం వల్లే ఈ భారీ బడ్జెట్ మూవీ నుంచి దుల్కర్ సల్మాన్ బయటకు రావాల్సివచ్చిందని ప్రచారం జరుగుతోంది. థగ్‌లైఫ్ నుంచి తాను వైదొలగడానికి గల కారణాలను కమల్‌హాసన్‌తో పాటు మణిరత్నంలకు దుల్కర్ వివరించినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీల్లో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తూనే ఇతర స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తున్నాడు. తెలుగులో సీతారామం బ్లాక్‌బస్టర్ తర్వాత లక్కీ భాస్కర్ అనే మూవీకి దుల్కర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అలాగే తమిళంలో సూర్య, సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. మలయాళంలో రెండు, హిందీలో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. వీటన్నింటి కారణంగా థగ్ లైఫ్‌కు డేట్స్ సర్ధుబాటు చేయడం కష్టంగా మారిందని, అందుకే కమల్‌హాసన్ మూవీ నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నాడని వినికిడి.
థగ్‌లైఫ్‌లో… దుల్కర్ సల్మాన్ ప్లేస్‌లో టాలీవుడ్ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో మణిరత్నం ఉన్నట్లు టాక్. నానికి ఈ అవకాశం దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మణిరత్నం తన ఫేవరేట్ డైరెక్టర్ అని నాని చాలా సందర్భాల్లో తెలిపాడు. అతడితో ఒక్క సినిమానైనా చేయాలన్నది తన కల అని పేర్కొన్నాడు.