ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ నేపధ్యంలో ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కొన్ని రోజులుగా ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పూరి, ఎన్టీఆర్ కు ఆగమ్ కథ మాత్రమే వినిపించాడట. మిగిలిన కథ కూడా ఎన్టీఆర్ ను, సంతృప్తి పరచగలిగితేనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. పూరి ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ మాత్రం కథ నచ్చితే యువ దర్శకులతో కూడా కలిసి పనిచేయాలనే ఆసక్తి చూపిస్తున్నాడట. వారు చెప్పిన కథలు ఎంతో శ్రద్ధతో వింటున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో అనిల్ రావిపూడి కూడా ఎన్టీఆర్ ను కలిసి ఓ కథ వినిపించారట. గతంలో కల్యాణ్ రామ్ తో ‘పటాస్’ చిత్రాన్ని రూపొందించిన అనిల్ రావిపూడి ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. మరి అనిల్ కు, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో.. లేదో.. చూడాలి!