తెలుగుదేశం పార్టీకి వైసీపీ వరుస షాక్‌లు ఇస్తోంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఆకర్ష్ పేరుతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా… మరికొందరు నేతలు అధికార పార్టీ వైసీపీలోకి వెళ్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన మాజీమంత్రి దేవినేని నెహ్రూ తనయుడు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ టీడీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీలో సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని అసంతృప్తితో ఉన్న అవినాష్ వైసీపీలో చేరాలని
నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులతో కలిసి దేవినేని అవినాష్ బుధవారం సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అవినాష్ తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అవినాష్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. ఆయనతో పాటు కడియాల బుచ్చిబాబు, తదితరులు చేరుతున్నట్లు ప్రచారం.