ఏపీ రాజకీయాలు రోజురోజుకు మరింత రంజుగా మారుతున్నాయి. నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఇక మిగిలింది ఈ రాజకీయ విన్యాసాలే లేండి. అలాగే, జగన్ పక్షం నిష్క్రియా పరత్వంలో ఇక మిగిలింది కూడా అధికార నాయకుల నిష్క్రమణల పరంపరే. ఇప్పటికే పార్టీ మారాలని కొందరు వైసీపీ నాయకులు ఉబలాట పడుతున్నారు. ఐతే, వీరందరూ ఎదురు చూస్తోంది ఓ ఒక్క క్లారిటీ కోసం. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నాడా?, లేదా ?. ఈ అనుమానం పై కుప్పం సంఘటన క్లారిటీ ఇచ్చింది. కుప్పం ఘటనలో పోలీసులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఫలితంగా ప్రశాంతంగా ఉన్న కుప్పం వేడెక్కింది.
బాబు అభిమానులు ఆక్రోశంతో తిరగబడ్డారు. ఐతే, కుప్పం ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. బాబాకు మద్దతుగా కామెంట్స్ చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో.. రాజమహేంద్రవరంలో భారీ ఎత్తున సమావేశం నిర్వహించారు. అదే రోజున కనుక చంద్రబాబు నాయుడు ఇలాంటి జీవో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించేవారా ? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందనే సామెత తీరుగా జగన్ వ్యవహార శైలి ఉంది. నేను విశాఖ జిల్లాలో పర్యటించినప్పుడు కూడా బయటకు రాకూడదు, మాట్లాడకూడదు, కారులో నుంచి చూడకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్షాలు గొంతు జగన్ అణిచివేయలేరు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
కుప్పం ఘటన పై పవన్ స్పందించిన విధానం చూస్తుంటే.. టీడీపీ, జనసేన పొత్తు కుదిరిందనే సంకేతాలే బలంగా జనంలోకి వెళ్తున్నాయి. బాబు – పవన్ మధ్య మళ్ళీ పొత్తు కుదిరిందని వైసీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 2014 పొత్తులనే మళ్లీ పునరావృతం చేస్తారని టాక్. ఇదే నిజం అయితే, జగన్ ప్రభుత్వానికి గండం తప్పదు. ఇప్పటికే ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిరసన సెగ జగన్ కి గట్టిగా తలుగుతుంది. ఈ క్రమంలోనే ఆనం గొంతు జగన్ కి వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేసింది. రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలను జగన్ ఇంకా వినాల్సి రావొచ్చు. అలాగే జగన్ హయాంలో ఇగో హర్ట్ అయిన నాయకులంతా ఇప్పుడు ఆయనకు దూరం జరగాలని కాసుకుని కూర్చున్నారు. ఎలాగూ పవన్ – బాబు పొత్తు పొడుస్తోంది అని క్లారిటీ వచ్చింది కాబట్టి.. వైసీపీ నుంచి జంపింగ్ లు కూడా ఎక్కువ ఉండొచ్చు.