AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నేతల దాడులు పెరిగిపోయాయి. రెండు రోజుల క్రితం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ బహిరంగ సభలో కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సంగతి తెలిసిందే.
మీడియా ప్రతినిధులపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. రౌడీల్లా వ్యవహరించి తీవ్రంగా గాయపరచడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే దాడులకు పాల్పడుతున్నారని ఇటువంటి చర్యలను సహించకూడదని ప్రజా సంఘాలు సైతం ఖండించాయి.
వైసీపీ కార్యకర్తల అరాచకం అరికట్టాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ప్రతి జిల్లాలో కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాయి. పలుచోట్ల ర్యాలీలు, ఆందోళనలు చేశాయి.
ఆ ఘటన మరువక ముందే ఇవాళ కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అనుచరులు వైసీపీ జెండాలతో వందలాదిగా వచ్చి ఈనాడు కార్యాలయంపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాళ్ల వర్షం కురిపించారు. వైసీపీ కార్యకర్తల మూకదాడిలో ఈనాడు కార్యాలయం అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఆ తర్వాత కార్యాలయం పోలీసులను సైతం లెక్కచేయకుండా ఈనాడు కార్యాలయం తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే కాటసానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తారా అంటూ కేకలు వేశారు. సీఎం జగన్‌కు, ఎమ్మెల్యే కాటసానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మీడియా సంస్థలపై వరుస దాడులను వైఎస్ షర్మిల ఖండించారు. పత్రికా స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులకు దిగడం వైసీపీ పాలనలో నిత్యకృత్యం అయిపోయిందని పలువురు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మీడియాపై దాడి అంటే ప్రజాస్వామ్యంపైన దాడి చేసినట్టేనని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.