HomeTelugu Big StoriesAP Elections 2024: వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి మేనిఫెస్టోల ప్రభావమెంత?

AP Elections 2024: వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమి మేనిఫెస్టోల ప్రభావమెంత?

AP Elections 2024

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం వైసీపీ, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ హోరా హోరీగా పోరాడుతున్నాయి. అధికారమే లక్ష్యంగా ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. వైసీపీ ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయగా.. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో ప్రకటించింది. ఈ రెండు మేనిఫెస్టోలలో అనేక ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నవరత్నాలు పేరుతో గత ఎన్నికల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చింది. వాటిలో ఎన్నో నిబంధనలతో అవి సరిగా అమలు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జగన్ బటన్ నొక్కినా కూడా అవి లబ్దిదారులకు అందడం లేదని ప్రతిపక్షమైన టీడీపీతో పాటు కొన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరుస్తామంటూ ఇచ్చిన హామీ సైతం నిరుపేదల్లో అసంతృప్తిని మిగిల్చిందనే చెప్పాలి.

సొంత ఇంటికోసం పేదల నుంచి డబ్బులు తీసుకున్నారని వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. మరికొందరు అయితే ఇళ్లు ఇవ్వకుండానే వాయిదాలు కట్టాలని బ్యాంకులు వేధిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో సముదాయాలు ఇప్పటికీ కేటాయింపులు జరిగాయి కానీ చాలా చోట్ల అవి పేదలకు అందనే లేదు. కొందరికి దక్కినా అక్కడ సరైన సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. ఊరికి చివర ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు అధికారులు లబ్దిదారులను వేధిస్తున్నారని అంటున్నారు.

అయితే తాజాగా టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో వైసీపీ అమలు చేస్తున్న కొన్ని పథకాలను కొనసాగిస్తామని అయితే వాటిలో ఎలాంటి లొసుగులు లేకుండా అందరికీ న్యాయం చేస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.
నవరత్నాల్లో భాగంగా వైసీపీ అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకంలో బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా 15 వేలు జమచేస్తోంది. అయితే ఇందులో రూ.2 వేలు కట్ చేసి ఇస్తున్నారని, ఇంట్లో ఒక్క బిడ్డకు మాత్రమే ఇస్తున్నారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అయితే తాము మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ చదువుకునేందుకు తల్లికి వందనం పేరుతో ఏటా రూ.15 వేలుచొప్పున ఇస్తామని టీడీపీ చెప్తోంది.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తోంది. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచే పింఛన్ మొత్తాన్ని రూ.4000 లకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల పింఛన్ బకాయిలు కలిపి జూన్ నెలలోనే రూ.7000 అందిస్తామంటోంది. అలాగే దివ్యాంగులకు నెలకు రూ. 6 వేలు పింఛన్ అందిస్తామని.. 100 శాతం దివ్యాంగులు అయితే రూ.10,000 అందిస్తామని టీడీపీ కూటమి మేనిఫెస్టోలో ప్రకటించింది.

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం ఏడాదికి రూ.13,500 చొప్పున వైసీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం అందించే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని 4 విడతల్లో అందిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే రైతుభరోసా మొత్తాన్ని ఏడాదికి రూ.16 వేలకు పెంచుతామని వైసీపీ మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారు. అయితే తాము గెలిస్తే ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయంగా అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరోవైపు 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత కింద ఏడాదికి రూ.18,750 సాయం అందిస్తోంది. టీడీపీ మాత్రం 19 నుంచి 59 ఏళ్లలోపున్న ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది.

ఇక వైసీపీ 3 రాజధానుల విధానానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించగా.. టీడీపీ మాత్రం అమరావతే రాజధానిగా ఉంటుందని చెబుతోంది. ఇక వైసీపీ ప్రకటించని.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను చంద్రబాబు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని.. ఉద్యోగం వచ్చేవరకు రూ.3 వేల చొప్పన నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని.. వాలంటీర్లకు గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. కాపులకు EWS నుంచి దామాషా పద్ధతిన రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పేదలకు గృహ నిర్మాణానికి సెంటు భూమి మాత్రమే ఇస్తున్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ త్వరలో అమల్లోకి తేవాలనుకుంటున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాము పూర్తిగా రద్దు చేస్తామని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని టీడీపీ హామీ ఇస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అలాగే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని అన్నారు. సామాన్యులకు ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu