Chandrababu Naidu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ పీలేరులో ‘రా.. కదలిరా’ అనే సభను నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ప్రజాకోర్టులో వైసీపీను శిక్షించే టైమ్ దగ్గరపడిందని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు.
ఆయనకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. ” వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రజలు కసినంతా ఎన్నికల సమయంలో జగన్‌పై చూపించాలి. వచ్చేది యుద్ధం.. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. కురుక్షేత్రంలో గెలుపు టీడీపీ, జనసేనదే.
ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకేయడం ఖాయం. పీలేరు గర్జన రాష్ట్రం మొత్తం వినిపించాలి. జగన్ రాయలసీమ ద్రోహి. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత టీడీపీదే. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. అబద్ధాల్లో జగన్ పీహెచ్‌డీ చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ. ఇలాంటి జలగ మనకు అవసరమా? బటన్ నొక్కుడులో ఎంత దోచుకున్నారో చెప్పాలి” అని చంద్రబాబు డిమాండ్ చేశారు.