వైసీపీని దెబ్బతీయడానికి ప్రజాశాంతి పార్టీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్ రెక్కలు వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ సింబల్ ను పోలి ఉందని దానిని కూడా సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది. గుర్తును మార్చాలని మార్చి 8న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలినట్లుగా ఉండే విధంగా అభ్యర్థులను ప్రజాశాంతి పార్టీ పోటీకి నిలిపిందని ఫిర్యాదులో పేర్కొంది. ఓటర్లలో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ద్వారా అయోమయానికి గురి చేసే విధంగా అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి, పార్టీ అదనపు కార్యదర్శి పద్మారావు గోపాలకృష్ణ ద్వివేదీకి ఫిర్యాదు చేశారు.