దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ కీలకఘట్టం. ఆయన ప్రజలకు మరింత చేరువ కావడానికి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వైఎస్సార్ చేసిన పాదయాత్ర ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ ఘట్టం ఆధారంగానే ‘యాత్ర’ తెరకెక్కింది. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డిగా ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించారు. ఈవెంట్ బేస్డ్ బయోపిక్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాల్ని పెంచాయి. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం…
కథ: ప్రజా ప్రస్థానం పేరుతో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి(మమ్ముట్టి) చేసిన పాదయాత్ర, అందులోని భావోద్వేగాలతో ప్రధానంగా సాగే చిత్రమిది. పాదయాత్ర ఎలా మొదలుపెట్టారు? ఆ ప్రయాణంలో ప్రజల కష్టాల్ని ఎలా విన్నారు? వాళ్లకి తానున్నాననే భరోసా ఎలా ఇచ్చారు? వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర పతకాలకి పాదయాత్ర ఎలా కారణమైంది? అనే విషయాల్ని ఈ సినిమాలో చూడొచ్చు. జాతీయ పార్టీలో ఉన్నప్పటికీ, హై కమాండ్‌ని కాదని ఆయన ఎలా నిర్ణయాలు తీసుకునేవారు? వ‌్యక్తిగతంగా ఆయన పార్టీపైన ఎలాంటి ముద్ర వేశారు? ప‌్రజల్లో ఎలా ఇమేజ్ తెచ్చుకున్నారనే విషయాల్ని ఇందులో చూపించారు. హైకమాండ్‌తో రాజకీయాలు, పాదయాత్ర మొదలుకొని… ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంతో ఈ కథ ముగుస్తుంది.
నటీనటులు: మమ్ముట్టి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయారు. వై.ఎస్‌లా కనిపించకపోయినా, ఆయన హావభావాల్ని అనుకరించకపోయినా ఆ పాత్ర ఆత్మని అర్థం చేసుకుని నటించారు. ఆయన సొంతంగా తెలుగులో సంభాషణలు చెప్పిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాలో సెంటిమెంట్, భావోద్వేగాలు పండటంలో మమ్ముట్టి పనితీరు కీలక పాత్ర పోషించింది. వై.ఎస్ ఆత్మీయుడైన కేవీపీ రామచంద్రరావు పాత్రలో రావు రమేష్, వై.ఎస్.విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి చక్కటి అభినయం ప్రదర్శించారు. వై.ఎస్.రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. సూర్యన్ కెమెరా పనితనం, ‘కె’ సంగీతం బాగుంది. ‘పల్లెల్లో కళ ఉంది’ పాట, చిత్రీకరణ విధానం ఆకట్టుకుంటాయి.
విశ్లేషణ: నమ్మి తన దగ్గరికి వచ్చినవాళ్లకి అభయం ఇవ్వడం మొదలుకొని… ఆయన ఒకసారి మాట ఇచ్చాక, ముందుకు వెళ్లాల్సిందే అనే తత్వాన్ని చూపిస్తూ, ఒక నాయకుడిగా ప్రజలతో ఎలా మమేకమయ్యారు? తనయుడు ప‌్రజానాయకుడు కావాలని తన తండ్రి రాజారెడ్డి కన్న కలని ఎలా నెరవేర్చారనే విషయాల్ని హైలైట్ చేస్తూ ఈ సినిమాని తీర్చిదిద్దారు దర్శకుడు. బయోపిక్ అంటే పుట్టు పూర్వోత్తరాలు మొదలుకొని ఉంటాయి. కానీ ఈ చిత్రం మాత్రం కేవలం వై.ఎస్ చేసిన పాదయాత్ర చుట్టూనే సాగుతుంది. ఆ యాత్రని ప్రారంభించడానికి ముందు సాగిన సంఘర్షణని కూడా బలంగా చూపించారు. అప్పుడు అధికారంలో ఉన్న బలమైన తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కోవాలి? గడువుకంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీని ఓడించి అధికారం ఎలా చేజిక్కించుకోవాలనే విషయంలో అప్పట్లో జరిగిన ఘటనలను ఆరంభ సన్నివేశాల్లో చూపిస్తూ అసలు కథని మొదలుపెట్టారు. ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో ఏందిరా రాజకీయం’ అనే సంభాషణతో వైఎస్సార్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించి… తనవాళ్లు అనుకున్నాక ఆయన వాళ్ల కోసం ఎంతదూరమైనా వెళతాననే విషయాన్ని ఆత్మీయుడైన కేవీపీ పాత్రతో చూపించారు. చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టే సన్నివేశాలతో భావోద్వేగాలు పండటం మొదలవుతుంది. కష్టాలు, కరవుతో రైతులు పొట్ట చేతపట్టుకుని వలస వెళ్లిపోతే, ఇంటి దగ్గర వృద్ధులు పడే అగచాట్లని సహజంగా చూపిస్తూ, అక్కడ కనిపించిన దయనీయ దృశ్యాలే ఆయన ప్రవేశపెట్టిన పథకాలకి కారణమయ్యాయన్నట్టుగా చూపించారు. ఆ సన్నివేశాలన్నింటిలోనూ భావోద్వేగాలు పండాయి.
ద్వితీయార్థంలో పార్టీని మించిన నాయకుడిగా రాజశేఖర్‌రెడ్డి ఎలా ఎదిగారనే విషయాల్ని చూపించారు. వై.ఎస్.విజయమ్మ, కేవీపీ, సబితా ఇంద్రారెడ్డి, వీహెచ్ తదితరుల పాత్రల్నే కాకుండా… కొన్ని కల్పిత పాత్రల్ని, కల్పిత సంఘటనల్ని కూడా సినిమాలో చూపించారు. పార్టీ హై కమాండ్‌కి ఏమాత్రం నచ్చని వ్యక్తిగా, హై కమాండ్‌ని ఎదిరించిన వ్యక్తిగా వై.ఎస్‌ని చూపించడం, కొందరు తెలుగుదేశం నాయకులు కూడా వై.ఎస్‌ని మెచ్చుకుంటూ ఆయనకి ఓటు వేస్తామని చెప్పడం, కాంగ్రెస్ పార్టీని ఒక విలన్‌గా చూపించడం వంటి సన్నివేశాలు కల్పితంలో భాగమే. చంద్రబాబు పాత్రని తెరపై నేరుగా చూపించలేదు. చిత్రబృందం ఇది రాజకీయ చిత్రం కాదని చెప్పుకొచ్చినా… సినిమా చూస్తున్నంతసేపు వర్తమాన రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకునే తెరకెక్కించిన భావన కలుగుతుంది. చాలావరకు సన్నివేశాలు వై.ఎస్ గురించి తీసిన ఓ డాక్యుమెంటరీలా సాగుతుంటాయి. చివరి ఐదు నిమిషాల సన్నివేశాల్ని వై.ఎస్‌కి సంబంధించిన నిజమైన విజువల్స్‌ని, ఆయన అకాల మరణానికి సంబంధించిన సన్నివేశాల్ని, తండ్రి మరణించాక ప్రజల ముందుకొచ్చి మాట్లాడిన జగన్ ప్రసంగాన్ని ఒక పాట నేపథ్యంలో చూపించారు.
టైటిల్ : యాత్ర
నటీనటులు : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి
సంగీతం : కె
దర్శకత్వం : మహి వీ రాఘవ
నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
హైలైట్స్
మమ్ముట్టి నటన
డ్రాబ్యాక్స్
ద్వితీయార్ధంలో కొన్ని సాగతీత సన్నివేశాలు
చివరిగా : రాజశేఖరరెడ్డిని ప్రజలకు మరోసారి గుర్తుచేసే ‘యాత్ర’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)