కరోనా వైరస్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్నూలు పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు అంటే చాలామందికి తెలుసు. మనం చాలాసినిమాల్లో వీరిని చూశాం. వారి గెటప్‌లతో ఉన్నవారిని రోడ్లపైకి వదిలారు పోలీసులు. అవసరం లేకున్నా ఇంటినుంచి బయటకు రావడం, అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారికి అవగాహన కల్పిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని డోన్ పట్టణంలో పోలీసులతో పాటు యముడు, చిత్రగుప్తుడు, యమభటుల వేషధారణల్లో ఉన్నవారు కూడా వారితో తిరుగుతున్నారు. ‘యముడు మిమ్మల్ని చూస్తున్నాడు. బయటకు వచ్చారో మిమ్మల్ని తీసుకెళ్లిపోతాడు. ’ అంటూ ప్రచారం చేస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు, ఒకవేళ కరోనా వచ్చినట్టు అనుమానం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారితో ప్రచారం చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీసులు కృషిచేస్తున్నారు.