ప్రముఖ భారత రెజ్లర్ దలీప్ సింగ్ రాణా( ది గ్రేట్ ఖలీ) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో రాణా రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘నరేంద్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. నీలేశ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటించిన బ్రెజిలియన్ మోడల్, నటి ఇసబెల్ లీత్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. రామ్ సంపత్ సంగీతం అందిస్తున్నారు.
రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్రవర్గాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాయి. ఖలీ ఎన్నో కమర్షియల్ ప్రకటనల్లో కనిపించారు. 2014లో రెజ్లింగ్ వృత్తిలో ఆయన ఎనిమిదో అత్యంత పొడవైన వ్యక్తిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. 2017లో డబ్ల్యూడబ్ల్యూఈలో నాలుగో అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయంత్ సి పరాన్జీ.. ‘ప్రేమించుకుందాం రా’, ‘ఈశ్వర్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి చిత్రాలను తెరకెక్కించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ‘నరేంద్ర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన చివరగా దర్శకత్వం వహించిన చిత్రం ‘జయదేవ్’.