మాస్ మహారాజా రవితేజకి చాలా రోజుల తర్వాత హిట్ ఇచ్చిన చిత్రం `క్రాక్.. ఈ చిత్రం తర్వాత రవితేజ వరుసగా నాలుగు సినిమాలకు కమిట్ కావడం విశేషం. ఆయన కమిట్ అయిన చిత్రాలు ఇంకా ఉన్నాయి. `క్రాక్` వచ్చి కూడా ఏడాది అయిపోయింది. ఆ తర్వాత రవితేజ నుంచి మరో సినిమా `ఖిలాడీ` కూడా వచ్చి పరాజయం చెందింది. కానీ `క్రాక్` చిత్ర కథ నాదే అంటూ ఓ రచయిత బయటకు రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. `
వివరాలుకు వెళ్తే క్రాక్` సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్‌లన్నీ తాను రాసుకున్న కథలోనివే అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్వాల్‌కి చెందిన శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి 2015లో `బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ` పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. ఏడాదిన్నర క్రితం వచ్చిన రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకంలో ఉన్నవేనని తెలిపారు. `క్రాక్` నిర్మాణ సంస్థతోపాటు, దర్శకుడు,హీరోలకు ఫిల్మ్ ఛాంబర్‌నుంచి నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదని సుబ్రమణ్య మూర్తి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరి ఇందులో నిజమెంతా అనేది తేలాల్సి ఉంది.