కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఏపీలోని అన్నిరకాల విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో అన్ని పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రధాని మోది ప్రకటించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు వార్షిక పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని, అది విద్యార్థులకు, అధికారులకు కూడా మంచిది కాదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ఈనెల 31న జరిగే సమీక్ష తర్వాత ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీనిపై విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. లాక్‌డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడి ఉన్నందున పిల్లకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాలంటీర్ల ద్వారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు.