జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. పార్టీ బలోపేతం గురించి చర్చించి కొన్ని రాష్ట్రస్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే ఆ కమిటీలను పూర్తిచేసి పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టంచేశారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు తాను ఓడిపోతే పార్టీ నడపగలనా అనుకున్నానని.. నిలబడాలని నిర్ణయించుకున్నాకే పార్టీ పెట్టానని పవన్ చెప్పారు. టీడీపీ లో ఉన్న తప్పుల్ని వెతకడానికి కొంత సమయం తీసుకున్నామని, వైసీపీ కి కొంత సమయం ఇస్తామన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కదిద్దాల్సిన అంశాలు చాలా ఉన్నాయని పవన్ అన్నారు. సమీక్ష సమావేశాలకు వచ్చినప్పుడు కొంతమంది నేతలు ఆయా జిల్లాల్లోని సమస్యలను ప్రస్తావించారని చెప్పారు. జనసేన పార్టీ ఉన్నదే సమస్యల పరిష్కారం కోసమని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టామన్నారు. ముందు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఉన్న చాలా మంది కార్యకర్తలను కలవాలని నిర్ణయించానని చెప్పారు. వారిని కలిసేందుకు కొంతమంది నాయకులతో పార్లమెంటరీ కమిటీలు వేస్తామని తెలిపారు. ఎన్నికల్లో పొత్తు గురించి భవిష్యత్‌లో నిర్ణయాలు ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాము ఒంటరిగానే వెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకహోదాపై మాట మారుస్తున్న నాయకులపై ప్రజలే ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు. అక్రమ కట్టడాలను కూల్చే అంశంలో అందరికీ ఒకే నియమం ఉండాలని, లేదంటే ప్రభుత్వాన్ని శంకించాల్సి వస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే పార్టీలు మారడం మంచి పద్ధతి కాదన్నారు. జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నామని చెప్పారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని పవన్ వెల్లడించారు.