టాలీవుడ్ కింగ్ నాగార్జున తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ప్రకటించారు. మహర్షి చిత్రానికి కథ అందించిన అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో ఆయన ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ ఎన్ఐఏ పోలీస్ ఆఫీసర్ విజయ్ వర్మగా కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను నాగార్జున శుక్రవారం విడుదల చేశారు. యదార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతోందని ఫస్ట్‌లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రానికి నిరంజన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు ‘వైల్డ్ డాగ్’ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసిన నాగ్ ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘చాలా రోజుల తర్వాత ఓ యదార్థ ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను. కొంత టెక్నీషియన్స్‌తో వినూత్నంగా సినిమాను తెరకెక్కిస్తున్నాం. 2020 ఎంతో అద్భుతంగా ఉండబోతోంది.’ అని నాగ్ పేర్కొన్నారు.