ప్రముఖ తమిళ నటుడు రాధా రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజుల క్రితం లేడీ సూపర్‌స్టార్ నయనతారపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్తా చిత్ర పరిశ్రమలో వివాదాస్పదంగా మారింది. దీనిపై గతంలో రాధారవి స్పందిస్తూ.. ‘నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి’ అన్నారు. అయితే ఇప్పుడు నయనతారకు ఎందుకు క్షమాపణ చెప్పాలి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
‘ఎనక్కు ఇన్నోరు ముగమ్ ఇరుకు’ అనే లఘు చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి రాధా రవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను తప్పుగా మాట్లాడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటానని గతంలో చెప్పాను. కానీ నేనెప్పుడూ ఎవ్వరికీ క్షమాపణలు చెప్పలేదు. అది నా రక్తంలోనే లేదు. అసలు నయనతారకు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి? క్షమించరాని నేరం చేశానా? ఈ రోజు నేను మాట్లాడుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు. ఆ రోజు నయనతార గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే విధంగా చప్పట్లు కొట్టి అభినందించారు. నేను నిజం మాట్లాడితే ప్రజలు నాకే మద్దతు పలుకుతారు. అయినా నేనెందుకు భయపడాలి? నేనిక సినిమాల్లో నటించేందుకు అవకాశం ఇచ్చేది లేదంటూ చాలా మంది బెదిరిస్తున్నారు. నన్నెవ్వరూ ఆపలేరు. సినిమాలు లేకపోతే నాటకాల్లో నటిస్తాను. అప్పుడేం చేస్తారు? అసలు ఇదో పెద్ద సమస్య అని నాకు అనిపించడంలేదు. ఇలాంటివన్నీ తాత్కాలికమే. నా మాటల్లో నిజం ఉంటే ఒప్పుకోండి. లేకపోతే వదిలేయండి’ అని మండిపడ్డారు రాధా రవి.