2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ? ఎవరు ఓడిపోతారో ? నిర్ణయించేది రాజకీయ పోరాటమే. ఆ పోరాటంలో ఏ నాయకుడు వాయిస్ అయితే, ప్రజల పక్షాన గట్టిగా వినిపిస్తోందో ఆ నాయకుడికే ఓట్లు ఎక్కువ పడతాయి. జగన్ రెడ్డి గొప్ప పరిపాలకుడు కాకపోవచ్చు, కానీ, ప్రజలను ఆకట్టుకోవడంలో జగన్ రెడ్డికి పక్కా క్లారిటీ ఉంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే.. జగనన్న సాయం పేరుతో బటన్ నొక్కిన ప్రతిసారీ వివిధ పత్రికలలో ప్రభుత్వం తరఫున భారీ ప్రకటనలు ఇస్తుంటారు. అందులో ఆయా వర్గాలకు వైసీపీ ముఖ్యంగా జగన్ రెడ్డి ఏం చేస్తున్నారో స్పష్టంగా రాస్తారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేదో కూడా రాస్తుంటారు. బహుశా ప్రజలంతా తన పేపర్, టీవీ మాత్రమే చూస్తారని జగన్ నమ్ముతున్నారు కాబోలు. అయినా, ఈ ప్రకటనలన్నీ ప్రభుత్వ ఖర్చుతో ఇచ్చేవే. తన పేపర్ కి టీవీకి బోలెడు ఆదాయం. నిజానికి ప్రజల ఖర్చుతో ఇచ్చే ప్రకటనల్లో రాజకీయ విమర్శలు చేయకూడదు. కానీ జగన్ రెడ్డి చేస్తాడు. జగన్ రెడ్డి టార్గెట్ ప్రజలను నమ్మించడం, అందుకోసం ఏమైనా చేస్తాడు.
వచ్చే ఎన్నికల్లో తన గెలుపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అడ్డు రాకూడదు. అందుకే, ఈ మధ్య జనసేన పార్టీ పైనా, పవన్ కళ్యాణ్ పైనా వైసీపీ నేతల విమర్శల జోరు పెరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ కోరుకున్నట్టే, పవన్ కళ్యాణ్ కూడా ఆవేశానికి లోనవుతున్నాడు. ఈ క్రమంలో స్టేజ్ ల పై పవన్ ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో స్పీచ్ ల్లో పొరపాట్లు దొర్లుతున్నాయి. ఆ పొరపాట్లును అడ్డం పెట్టుకుని వైకాపా సద్వినియోగం చేసుకోవడానికి సోషల్ మీడియాని వాడుకుంటుంది. నిజానికి జగన్ రెడ్డి డిజిటల్ టీమ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు ఉండగా.. ఒక్క పవన్ పైనే ఎందుకు ?, కారణం ఒక్కటే. ఆంధ్రలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడకి పవన్ కళ్యాణ్ ఆఘమేఘాల మీద వెళ్తున్నాడు. ఇది అధికార పక్షానికి ఇబ్బందే. పైగా పవన్ పై ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతుంది. అది జగన్ రెడ్డికి తీవ్ర నష్టం.
ఉదాహరణకు గత ఎన్నికల సరళి పరిశీలిద్దాం. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి పోటీ చేయడం వల్ల ఎక్కువగా తెలుగు దేశం నష్టపోయింది. 2014లో పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం, భాజపా కూటమికి మద్దతు ఇవ్వడం వల్ల ఆ రెండు పార్టీలు బాగా లాభపడ్డాయి. వైసీపీ బాగా నష్టపోయింది. అంటే, దీని అర్ధం ఏమిటి ?, మెగా హీరోలకు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కు ఓ వర్గంలో బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ విషయం జగన్ రెడ్డికి బాగా అర్ధం అయ్యింది. అందువల్లే పవన్, చంద్రబాబు కలిస్తే, తమ ఉనికికే ప్రమాదం అని జగన్ రెడ్డి భావించాడు. అందుకే పవన్ పై దత్త పుత్రుడు, పాకేజీ స్టార్ వంటి విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. జనసేన శ్రేణులను అణచివేస్తున్నారు. ఐతే, పవన్ కళ్యాణ్ ఈ సారి తగ్గి టీడీపీతో కలిసి వెళ్ళడానికే ఆసక్తి చూపిస్తున్నాడు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.