కేంద్ర ప్రభుత్వ తీరుపై కృష్ణా జిల్లా చల్లపల్లి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని దుయ్యబట్టారు. రఫేల్ కుంభకోణం ద్వారా మోడీ సర్కారు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సీబీఐ, ఈడీలతో ప్రశ్నించేవారిని బయపెట్టేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీను ఎవరూ నాశనం చేయలేరన్నారు. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ, జనసేన ఎందుకు పోటీ చేయటం లేదని ప్రశ్నించారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.70 వేల కోట్లు రావాలని నిజనిర్థారణ కమిటీ (జేఎఫ్‌సీ) ద్వారా చెప్పిన జనసేన అధినేత పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని సీఎం నిలదీశారు. బీజేపీకు టీఆర్‌ఎస్, జనసేన, వైసీపీ అండగా ఉండి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 25 స్థానాల్లో టీడీపీను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందిన రైతులు సభావేదికపై సన్మానించారు.