
Chiranjeevi about Rajamouli:
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల రాజమౌళి సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. “ప్రతి నటుడి కల రాజమౌళితో పనిచేయడం” అని చెప్పినా, చిరంజీవి మాత్రం తన శైలికి రాజమౌళి పద్ధతి సరిపోదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
పింక్‌విల్లాతో మాట్లాడిన చిరంజీవి మాట్లాడుతూ, “రాజమౌళి గారు ఒక్కో సినిమా కోసం 4–5 సంవత్సరాలు ఖర్చు పెడతారు. కానీ నేను ప్రస్తుతం నాలుగు సినిమాలు ఏకకాలంలో చేస్తున్నాను. ఒకే సినిమాకు 3–4 ఏళ్లు కేటాయించడం నా చేత కాదు” అని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు సినీప్రజల్లో ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే చిరంజీవి స్థాయి నటుడు ఒక పాన్ ఇండియా దర్శకుడితో పని చేయడం ఎప్పుడైనా జరుగుతుందని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ చిరంజీవి మాత్రం స్పష్టం చేస్తూ, “రాజమౌళితో పని చేసి పాన్ ఇండియా స్థాయిలో నన్ను నిరూపించుకోవాలనే ఉద్దేశం లేదు. నాకు అలాంటి అవసరం కూడా లేదు” అని చెప్పారు.
ఇది ఒక రకంగా ఆయన ధైర్యమైన వ్యాఖ్యగానే చెప్పాలి. ఆయన తన పని శైలిని, గమనాన్ని, ప్రాధాన్యతలను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ఇప్పటికే రాజమౌళితో రెండు సినిమాలు చేశాడు. ముఖ్యంగా RRR సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి శ్రికాంత్ ఓదెల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో కలిసి కొత్త ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. పెద్ద సినిమాలు కంటే వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించాలనేది చిరు ప్లాన్.
అంతేకాదు, “ప్రతీ గొప్ప అవకాశాన్ని అందుకోకపోయినా, నా బాటలోనే వెళ్తాను” అనే చిరంజీవి మాటలు ఎంతో మందికి ప్రేరణగా మారుతున్నాయి.
ALSO READ: Coolie తెలుగు హక్కులకు ఇంత డిమాండ్ ఉందా?