తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘RRR’…. ఆర్ఆర్ఆర్ అంటే పూర్తి పేరు ఏంటి? హీరోయిన్స్ ఎవరు? కథ ఏంటి? అనేది ఇన్నాళ్లు సస్పెన్స్‌గానే ఉండింది. RRR అంటే ‘రామరావణ రాజ్యం’ అని కొందరు, కాదు… RRR అంటే ‘రఘుపతి రాఘవ రాజారాం’ అని మరికొందరు ఎవ్వరికి నచ్చినట్టు వారు ఊహించుకున్నారు. అయితే ఎట్టకేలకు ప్రెస్‌మీట్ పెట్టి ప్రేక్షకులకు ఉన్న అన్ని అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశాడు సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ నటించబోతున్నట్టు ప్రకటించి… అందర్నీ ఆశ్చర్యంలో పడేశాడు జక్కన్న. హీరోయిన్ల విషయంలో కూడా మూవీ ఎక్స్‌పట్స్ అంచనాలను తలకిందులు చేశాడు జక్కన్న
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ నటిస్తుందని ప్రకటించిన జక్కన… ఎన్.టీ.ఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నట్టు ప్రకటించాడు. అలీయా భట్ గురించి అందరికీ తెలుసు కానీ… ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్ అని అందరూ ఆసక్తిగా గూగుల్ చేస్తున్నారు. డైసీ ఎడ్గర్ జోన్స్… హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్. హాలీవుడ్‌లో 22 ఏళ్ల క్రితమే ‘కోల్డ్ ఫీట్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది డైసీ. ఆ తర్వాత గత ఏడాది విడుదలైన ‘పాండ్ లైఫ్’ అనే సినిమాలోనూ నటించింది. ఇప్పుడు ‘RRR’ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాలో కథకు అనుగుణంగా బ్రిటిన్ పిల్లగా డైసీ ఎడ్గర్ జోన్స్ కనిపించబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం. భారతీయ సినిమా విలువను వెయ్యింతలు పెంచిన ‘బాహుబలి’ చిత్రాన్ని చెక్కినట్టుగానే ఈ సినిమాను కూడా రెండేళ్లు తెరకెక్కించబోతున్నాడు . 2020 జూలై 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికీ, నందమూరి కుటుంబానికి పెద్దగా పడదు అనే నెగిటివ్ టాక్ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా హీరోలు లోపల ఎంత సఖ్యంగా ఉన్నా, ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుచచ్చేవారు. అలాంటి రెండు స్టార్‌లను కలుపుతూ జక్కన్న రూపొందిస్తున్న ‘RRR’ సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ ఛేంజర్‌గా మారుతుందని అంచనా వేస్తున్నారు సినీ ప్రేక్షకులు.