ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్’. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించింన ఈ చిత్రం గతేడాది విడుదలై అక్కడ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీన్ని తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేయనున్నారు. ఇందులో భాగంగా రీమేక్ హక్కులను రామ్‌చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘లూసిఫర్’ ను రీమేక్ చేయనున్నారు.
అయితే, ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సుకుమార్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఆయన అల్లు అర్జున్ చిత్రంతో బిజీగా ఉండటంతో సుకుమార్ పేరు పక్కకు వెళ్లిపోయింది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి వి.వి.వినాయక్ అయితే, న్యాయం చేస్తారని చిరు భావిస్తున్నారట. ఎందుకంటే చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించారు. ఆయన మాస్ ఇమేజ్‌కు సరిపోయేలా ఆ సినిమాను తీర్చిదిద్దారు. కానీ, రామ్‌చరణ్ మరోలా ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ అయితే, స్టైలిష్‌గా తీస్తారని భావిస్తున్నారట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ను స్టైలిష్‌గా తీసి మంచి పేరు తెచ్చుకున్నాడు సుజీత్. ఇప్పుడు ‘లూసిఫర్’ రీమేక్ కూడా ఆయన స్టైలిష్‌గా తీస్తారని చరణ్ భావిస్తున్నడట. అనుభవం దృష్ట్యా చిరంజీవి వినాయక్ వైపు మొగ్గు చూపుతున్నారు అనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.