ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జలసిరికి హారతి కార్యక్రమంలో భాగంగా శనివారం తమ్మినాయుడుపేట దగ్గర నాగావళి నదికి చంద్రబాబు హారతిచ్చారు. తర్వాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో జనవరిలో ఎన్నికలొస్తాయని వైసీపీ అధినేత జగన్‌కు ఎవరు చెప్పారని అన్నారు. ‘శుక్రవారం నాడు జైలుకెళ్లి.. బయటకు వచ్చి నన్ను తిడతాడా’ అంటూ జగన్‌పై చంద్రబాబు మండిపడ్డారు. అసెంబ్లీకి రాని వైసీపీ నాయకులకు జీతాలెందుకని ప్రశ్నించారు. లాలూచీ రాజకీయాలు చేయడమే వైసీపీ నాయకుల పని అని విమర్శించారు. తామే గెలుస్తామంటూ ఈ మధ్యే ప్రతిపక్ష నాయకుడు తప్పుడు సర్వే చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఏం అనుభవముందని ప్రజలు వైసీపీని గెలిపిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే నాడు బాబ్లీ కోసం పోరాటం చేశామని చంద్రబాబునాయుడు తెలిపారు. కేసులు పెట్టబోమని చెప్పి విమానం ఎక్కించి హైదరాబాద్‌లో దించారని, ఇప్పుడు నోటీసులు పంపించారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే బాబ్లీ కేసులో నోటీసులు పంపించారని విమర్శించారు. ఈ నోటీసులకు భయపడేది లేదని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని చంద్రబాబు తెలిపారు. ఎనిమిదేళ్ల తర్వాత నోటీసులు రావడమేంటని బాబు ప్రశ్నించారు. ‘ప్రధాని మోడీని ఎవరూ ఎదిరించకూడదు. ఎదిరిస్తే…ఇలానే నోటీసులు వస్తాయి’ అని చంద్రబాబు అన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వరు.. పోలవరానికి నిధులు ఇవ్వరు..కేంద్రం సహకరించకుండా అడ్డుకుంటోందని, లేకుటే ఏపీ ఇంకా అభివృద్ధి చెందేదని చంద్రబాబు తెలిపారు.