AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీచేస్తున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగా బరిలో నిలుస్తోంది. వైసీపీని ఎలాగైనా ఓడించాలని, జగన్‌ను గద్దె దించాలని కంకణం కట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన, బీజేపీతో జత కట్టాయి. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని, అప్పుల్లో కూరుకుపోయిందని, ఏపీ ప్రజలు నానా అవస్థలు
పడుతున్నారని, సైకో జగన్ పాలనను ఎలాగైనా అంతం చేయాలని చంద్రబాబు ప్రతి బహిరంగ సభలోనూ జగన్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు ప్రచార హోరులో ముందున్నారు. ఓవైపు చంద్రబాబు, మరోవైపు లోకేష్ ప్రచారం నిర్వహిస్తుండగా, జనసేన తరపున అధినేత పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ తరపున ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలకూడదని, రాష్ట్ర
భవిష్యత్తు, ఏపీలోని యువత భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయని పవన్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం అందరం బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.
మరోవైపు తాను స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనంచేసిన వైఎస్ షర్మిల ఏపీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తన అన్న జగన్ టార్గెట్‌గా ప్రతి సభలోనూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏపీకి ఏమాత్రం మంచి చేయని బీజేపీని ఎఁదుకు గెలిపించాలని అని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చిందా.. యువతకు ఉద్యోగాలు ఇచ్చిందా.. పోలవరం పూర్తిచేసిందా… ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిందా.. ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమిచ్చిందని వాళ్లకు ఓటేయాలని షర్మిల నిలదీస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో బరిలో నిలిచింది. బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో పోటీచేస్తున్నాయి. ఒకే విడతలో ఏపీలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
ఏపీలో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఏపీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు చాలా సర్వేలు వచ్చాయి. 11 సర్వేల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని తేలింది. ఈ తరుణంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తనకు స్పష్టత ఉందని, దానికి సంబంధించి స్పష్టమైన సమాచారం కూడా ఉందంటూ సంచలనానికి తెరలేపారు.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు 145 స్థానాల్లో విజయం సాధించబోతున్నారని, అలాగే ఏపీలోని 23 లోక్‌సభ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తున్నట్లు వెల్లడించారు. జూన్ 9న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సునీల్ బన్సల్ తేల్చి చెప్పారు. అమిత్ షాకు వీరవిధేయుడులాంటి బన్సల్ ఏపీలో కూటమిదే అధికారం అని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నివేదికల ప్రకారం వైసీపీ 30 సీట్లకే పరిమితమవుతుందని అన్నారు. ఇప్పటికే సర్వేలు స్పష్టమైన ఫలితాలను వెల్లడించడం, కేంద్ర ప్రభుత్వానికి కూడా అవే నివేదికలు అందడంతో వైసీపీకి
ఓటమి తప్పదని తెలుస్తోంది.