‘పక్షుల్ని బతికించండి.. భూమిని కాపాడండి’ అంటూ ‘2.ఓ’ సినిమాలో అక్షయ్ కుమార్ పక్షిరాజు పాత్రలో ఒదిగిపోయాడు. రేడియేషన్ కారణంగా పక్షులు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుంటే తల్లడిల్లిపోయే పర్యావరణ ప్రేమికుడిలా ఆ పాత్రను రూపొందించారు దర్శకుడు శంకర్. అంతగా ఆకట్టుకున్న ఈ పాత్రకు స్ఫూర్తి ఎవరో తెలుసా? భారత ఉపఖండంలోని పక్షిజాతులపై తొలి సమగ్ర సర్వే నిర్వహించిన ప్రఖ్యాత విహంగ శాస్త్ర(ఆర్నిథాలజీ) నిపుణుడు, పర్యావరణ వేత్త సలీం అలీ. అవును, ఆ మహనీయుడి జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగానే ‘పక్షిరాజు’ ఆవిష్కృతమయ్యాడు.
‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా’గా ప్రపంచ పర్యావరణ వేత్తలు ముద్దుగా పిలుచుకునే సలీం అలీ పక్షుల కోసం ఎంతగానో పాటుపడ్డారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దేశంలోనే తొలి పక్షుల అభయారణ్యం నెలకొల్పారు. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. పక్షుల జీవనాన్ని చెప్పే ఎన్నో అద్భుతమైన పుస్తకాల్ని రాశారు. సలీం అలీ అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. జూన్ 20, 1987లో సలీం అలీ తుది శ్వాస విడిచారు.
పక్షిరాజు పాత్రకు సలీం అలీని స్ఫూర్తిగా తీసుకోవడం గురించి ‘2.ఓ’ కథా రచయిత జయమోహన్ మాట్లాడుతూ ‘సలీం అలీ నేటి పరిస్థితుల్లో జీవించి ఉంటే.. మన సాంకేతిక వినియోగ సంస్కృతి కారణంగా ప్రకృతికి జరుగుతున్న కీడుని చూస్తే ఎంత ఆవేశానికి గురవుతారో చూపాలనే పక్షిరాజు పాత్రను సృష్టించాం’ అన్నారు. అక్షయ్ కుమార్ స్థానంలో తొలుత ఈ పాత్ర కోసం కమల్ హాసన్‌ను అనుకున్నారట. ‘నిజానికి పక్షిరాజు పాత్రను కమల్ హాసన్ చేయాల్సింది. అందుకు తగ్గట్టే సినిమాలోని మొత్తం ఉద్వేగాన్నంతటినీ ఆ పాత్రలో చొప్పించాం’ అని జయమోహన్ తన బ్లాగులో రాసుకొచ్చారు. శంకర్ – కమల్‌హాసన్ కలయికలో రాబోతున్న ‘భారతీయుడు -2’ కథకీ జయమోహన్ పని చేస్తున్నారు.