తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే రాహుల్‌తో పాటు అనేక మంది జాతీయ స్థాయి నాయకులను కలిసిన చంద్రబాబు సోమవారం సాయంత్రం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. బీజేపీకు వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఈభేటీ ముగిసిన అనంతరం ఇద్దరు నేతలూ మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. ముందుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మమతతో అనేక విషయాలు చర్చించానన్నారు. ఈ నెల 22న ఢిల్లీలో ఏర్పాటు చేయాలనుకున్న సమావేశం ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వాయిదా పడిందని చెప్పారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందే బీజేపీయేతర పక్షాల నేతలంతా సమావేశం కానున్నట్టు తెలిపారు. అంతా ఏకతాటిపైకి వచ్చాక ఐక్య పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో ప్రణాళికను రూపకల్పన చేస్తామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొనేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. అనంతరం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశాన్ని కాపాడుకొనేందుకే కలిసి నడుస్తున్నామని చెప్పారు. ఇంతకుముందు తాము కర్ణాటకలోనూ చర్చలు జరిపామని మమత వెల్లడించారు.