కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణకు.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. ఈ కారణంగా సినిమా షూటింగ్ లు కూడా ఆగిపోయాయి. దీంతో సినిమాలల్లో పనిచేసే రోజువారి కూలీలు కార్మికులకు సహాయం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ’ని ఏర్పాటు చేసారు. కాగా ఈ ఛారిటీకి ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. నటీ నటులతో పాటు నిర్మాణ సంస్థలు కూడా చేయూతనిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ సహాయనిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.10 లక్షలు అందజేసిన చలనచిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తాజాగా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి మరో రూ. 5 లక్షలు విరాళం ప్రకటించింది. ఫలితంగా ఇప్పటివరకు వైజయంతీ మూవీస్ అందజేసిన కరోనా విరాళం మొత్తం రూ. 25 లక్షలకు చేరుకుంది. చిత్ర పరిశ్రమకు వెన్నెముక అయిన దినసరి వేతనంతో పనిచేసే కార్మికులను ఆదుకోవడానికి సీసీసీకి రూ. 5 లక్షలు అందజేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సినీ కార్మికులను ఆదుకోవడానికి సీసీసీని ఏర్పాటు చేయడాన్ని తాము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని. చిత్రసీమలోని మిగతా ప్రముఖులంతా ఈ మంచి పనికి తోడ్పాటునివ్వాలనీ కోరింది. ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలనీ, కరోనాపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకు అందరూ సహకరించాలనీ సంస్థ విజ్ఞప్తి చేసింది.