చైనాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 563 మంది మృతిచెందారు. ఆస్పత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారు. గతేడాది చివర్లో వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్.. ఇప్పుడు చైనాతో పాటు 26 దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
కరోనా వైరస్ బయటపడిన వుహాన్ నగరం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వైరస్ తీవ్రత ఎక్కువ అవుతుండటంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లకే ప్రజలు పరిమితమవుతున్నారు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పటికీ అక్కడి ప్రజలను బయటకు అనుమతించడం లేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మొత్తానికి వుహాన్ డెడ్ సిటీని తలపిస్తోంది.
వుహాన్ వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయని, ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయని, హాంకాంగ్ ఆర్థిక, వాణిజ్య కార్యాలయ డైరెక్టర్ విన్సెంట్ ఫంగ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. వూహాన్‌లో నిత్యావసరాల విషయంలో పెద్దగా సమస్య లేదని తెలిపారు. సూపర్‌మార్కెట్లు, మందుల దుకాణాలు తెరిచే ఉన్నాయని,వస్తువుల సరఫరా కూడా బాగా జరుగుతోందని తెలిపారు. చాలా మంది ప్రజలు ఇళ్లల్లోనే చిక్కుకుపోయారని కరోనా వైరస్‌ను తరిమికొట్టే యుద్ధానికి ప్రజలు
ఐక్యతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు.