HomeTelugu Newsసిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి.. మీడియాతో వివేకా కుమార్తె సునీత

సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి.. మీడియాతో వివేకా కుమార్తె సునీత

5 19వైఎస్‌ వివేకా హత్య కేసులో సిట్‌ దర్యాప్తుపై ప్రభావం పడేలా మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేస్తోందని, దీన్ని ఆపాలని వివేకా కుమార్తె సునీత కోరారు. గత ఐదు రోజులుగా ప్రసార మాధ్యమాల్లో వస్తున్న రకరకాల వార్తలను చూసి బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్‌ నివేదిక వచ్చే వరకూ మీడియా, రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని అభ్యర్థించారు. పులివెందులలో బుధవారం సునీత మీడియా సమావేశం నిర్వహించారు.
‘మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. ఆయనకు ముందు ప్రజాసేవ, తర్వాతే కుటుంబం. పులివెందులలోని ప్రజలంటే ఆయనకు ఎంతో ఇష్టం. కొంత కాలంగా మా అమ్మకు అనారోగ్యంగా ఉంది. కాబట్టి నా దగ్గరే ఉంటోంది. చాలా కాలంగా నాన్న ఒక్కరే పులివెందులలో ఉంటున్నారు. ఐదు రోజుల క్రితం నాన్న చనిపోవడంతో చాలా బాధ కలిగింది. కానీ పేపర్లు, టీవీల్లో వచ్చినవి చూస్తుంటే ఇంకా ఎక్కువ విచారం కలుగుతోంది. మానాన్న ఎంతో హుందాగా బతికారు. చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదని అంటుంటాం. ఈ విషయంలో కూడా ఇలా వ్యవహరించడం సరికాదు. మీడియాలో వస్తున్న వార్తలు దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని అనిపించడం లేదా? ఈ కిరాతకమైన పని చేసిన వారిని గుర్తించాలి కదా! వారికి శిక్ష పడాలి. సిట్‌ నిరంతరం ఈ ఘటనపై పని చేస్తోంది. ఈ బృందం నుంచి ఏ సమాధానం రాకుండా ఏది పడితే అది రాసుకుంటూ పోతే సరైన విచారణ ఎలా జరుగుతుంది. చాలా నెగటివ్‌ వార్తలు వ్యాపిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం సబబు కాదు. జగన్‌ సీఎం కావాలని మా నాన్న బాగా కష్ట పడ్డారు. ఆయన బతికున్నప్పుడు ఎలా గౌరవించారో.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. సిట్‌ను స్వతంత్రంగా పని చెయ్యనివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు.

ప్రతి కుటుంబంలోనూ పొరపొచ్చాలు ఉంటాయి. మా కుటుంబంలో 700 మంది సభ్యులు ఉన్నారు. అభిప్రాయభేదాలు ఉండడం సహజమే. దీనర్థం ఒకరినొకరం చంపుకుంటామని కాదు. అది మా సంస్కృతి కాదు. మేం ఒకరినొకరం గౌరవించుకుంటాం. ఇది అర్థం చేసుకోవడానికి కొంతైన మానసిక పరిపక్వత ఉండాలి. ఏటా మా కుటుంబ సభ్యులు ఒకచోట కలుసుకుంటాం. మాలాంటి కుటుంబం ఎక్కడా ఉండదు.

హత్యా ఘటనపై సునీత అభిప్రాయమేంటని విలేకరులు ప్రశ్నించగా.. ‘ఈ సమయంలో నా అభిప్రాయాలతో సంబంధం లేదు. పెద్ద వాళ్లే ఊహాగానాలు వ్యాప్తి చేస్తుంటే దీని ప్రభావం దర్యాప్తుపై పడుతుంది కదా! లేఖలో ఉన్న చేతి రాత ఫోరెన్సిక్‌ నివేదికలో తేలుతుంది. నేను చెప్పడం సరికాదు.’ అని బదులిచ్చారు. సీబీఐ విచారణ అని జగన్‌ అంటున్నారు. మీరు అదే కోరుకుంటారా..? అన్న మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరగడం ముఖ్యం. అది ఏ సంస్థ అయినా సరే’ అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu