vivekam biopic damage to jagan: ఏపీలో ఎన్నికల పోరు మొదలైన క్రమంలో టాలీవుడ్‌లో పలు బయోపిక్‌లు వచ్చాయి. వైసీపీకి మద్దతుగా మహి వి రాఘవ్ ‘యాత్ర 2’, రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు తీశారు. వైసీపీకి వ్యతిరేకంగా ‘రాజధాని ఫైల్స్’ వచ్చింది. తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి బయోపిక్ ‘వివేకం’ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో సాగే కథ ఇది. నేరుగా పే ఫర్ వ్యూ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లిపోయింది. ఈసినిమాలోని కొన్ని సీన్‌లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా దర్శకుడు, నిర్మాత, నటీనటులు ఎవరూ ఏంటీ అనేది కూడా తెలియదు. పెద్దగా ఈ సినిమా గురించి ప్రచారం కూడా చేసుకోలేదు. అయినా ఇలా విడుదలై, అలా వైరల్ అయిపోయింది.
వివేకానంద హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు, వివేకానందరెడ్డికీ, జగన్ రెడ్డికీ ఎందుకు విభేదాలు వచ్చాయి. తదితర ఆసక్తికర అంశాలను ధైర్యంగా వెండి తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. నటీనటులు కూడా నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉన్నవాళ్లనే ఎంచుకొన్నారు.
సీబీఐ రిపోర్ట్ ఆధారంగా ఈ సినిమా తీశామని చిత్ర బృందం చెబుతోంది. పాత్రల పేర్లు కూడా నేరుగా వాడేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక వర్గలు సోషల్ మీడియాలో ఈ మూవీ సీన్లు వైరల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలు కారణంగా ఏ పార్టికీ పెద్దగా డామేజ్ జరగలేదు. కానీ ఎవరో తెలియని ఓ వ్యక్తి తీసిన ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.