హీరో విశాల్ పెళ్లిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అయిన అనీశాతో వివాహం జరగనున్నట్లు విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి మీడియా ద్వారా వెల్లడించారు. అయితే విశాల్‌ను పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. ‘పెళ్లిచూపులు’ చిత్రంలో విజయ్ దేవరకొండకు ప్రేయసిగా నటించిన యువతే. విజయ్ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోనూ అనీశా నటించారు. విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను అనీశా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. నా ఎదుగుదలలో, ఆలోచనల్లో స్ఫూర్తిగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి నాకు సరైన తోడు దొరికింది. విశాల్ మంచి మనసు నాకెంతో నచ్చింది. విశాల్‌తో జీవితం పంచుకుని ఆయన్ను సంతోషంగా ఉంచడానికి నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను.’ అని అనీశా పేర్కొన్నారు. ఈ నెలలోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగబోతోందని విశాల్ తండ్రి వెల్లడించారు. పెళ్లి కూడా ఇక్కడే చేయబోతున్నట్లు పేర్కొన్నారు.