Vishal: తమిళ హీరో విశాల్ రాజకీయ ఎంట్రీపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే విశాల్ రాజకీయ పార్టీ పెడతారని టాక్. ఈక్రమంలో ఈ విషయంపై విశాల్ స్పందించాడు. తాను ఇప్పట్లో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం లేకపోలేదని విశాల్ తేల్చిచెప్పారు. తాను రాజకీయ లబ్ధి కోసం పాకులాడే వ్యక్తిని కాదని, ప్రజలకు సేవ చేయాలనే అంకితభావం తనకుందని అన్నారు. భవిష్యత్‌లో పరిస్ధితులు మారితే ప్రజలకు మార్గదర్శకత్వం వహించేందుకు తాను సిద్ధమని చెప్పారు.
భవిష్యత్‌లో పరిస్ధితులు నిర్ధేశిస్తే ప్రజల్లో ఒకడిగా వారి గొంతుక వినిపిస్తానని చెప్పుకొచ్చారు. తాను ఇప్పటికే దేవీ ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నానని తెలిపిన విశాల్ అనేక మంది విద్యార్థులను తాను చదవిస్తున్నానని, రైతులను ఆదుకున్నానని చెప్పుకొచ్చారు. తాను లాభాలను ఆశించి ఏ పనిచేయనని ఆయన అన్నారు.
కాగా, 2017లో రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు విశాల్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మాజీ సీఎం జయలలిత మరణంతో జరిగిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ ప్రయత్నించగా ప్రిసైడింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.
ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. విజయ్ తన పార్టీని అధికారికంగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమని, ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వమని తెలిపారు. విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పారు. ఈక్రమంలోనే విశాల్ కూడా రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వచ్చాయి.