చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే సమయంలో చంద్రుడి ఉపరితలంపై పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. అందుకే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినట్లు భావిస్తున్నారు. చంద్రుడి ఉపరితలంలో 30 కిలోమీటర్ల ఎత్తులో ఆరంభమైన ల్యాండర్ దిగే ప్రక్రియ 15 నిమిషాల పాటు జరగాలి. మొదట్లో అంతా సవ్యంగానే జరిగినా ఆ తర్వాత సమస్య తలెత్తింది. వ్యోమనౌకలోని కెమెరాలు ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ఆఖరి ప్రక్రియ. కీలకమైన ఆదశలో ల్యాండర్ అనుకోకుండా పల్టీలు కొట్టింది. విక్రమ్ ల్యాండర్‌లోని ఇంజిన్లు వ్యతిరేక దిశలో పనిచేస్తూ దాని వేగాన్ని నియంత్రిస్తున్నాయి.
ఆ క్రమంలో ల్యాండర్ పల్టీ కొట్టడంతో కొద్దిసేపు ఇంజిన్లు ఆకాశంవైపునకు మళ్లాయి. దీంతో ల్యాండర్ వేగం తగ్గాల్సింది కాస్త వేగం పెరిగింది. దాంతో అతి వేగంగా ల్యాండర్ జాబిల్లివైపు దూసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత దిశను మార్చుకున్నప్పటికీ వేగం తగ్గలేదు. విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో పంపిన డేడాలో ఈ వివరాలున్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ పరిణామం తర్వాతే ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ల్యాండర్ కిందికి దిగే సమయంలో కాని, వ్యోమనౌక నియంత్రణలో వైరుధ్యాలు చోటుచేసుకోవడం వల్ల కానీ ల్యాండర్ పల్టీలు కొట్టి ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అంచనా.