సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజా చిత్రం లడ్కీ. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి తెలుగులో అమ్మాయి, తమిళంలో పొన్ను అని పేర్లను ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్న ఈ సినిమాలో పూజా భలేకర్ హీరోయిన్.
తాజాగా అమ్మాయి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, కీరవాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్యామల హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ సినిమా జులై 15న విడుదల కానుంది. ఈ సినిమా కోసం హీరోయిన్ భలేకర్ పదేళ్లుగా కష్టపడిందట.
మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఓ గేమ్ ఆడదామని ఆర్జీవీని అడిగింది యాంకర్ శ్యామల. ఇప్పటివరకూ ఇతర భాషల్లో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సినిమాలను తెలుగులో చెప్తాను, ఆ సినిమా టైటిల్ ఏమిటో గెస్ చేయాలంది. చంపూ రశీదు సినిమా ఒరిజినల్ టైటిల్ ఏమిటో చెప్పాలని శ్యామల మొదటి ప్రశ్న అడిగింది.
దీనికి వర్మ ఆ పేరెప్పుడూ వినలేదే అని తల గోక్కున్నాడు. దీంతో శ్యామల కిల్ బిల్ అని సమాధానం చెప్పి నవ్వేసింది. ఇది జోకా? అని ఓ చూపు చూసిన వర్మ.. ప్రస్తుతం నేను ఎమోషనల్‌గా ఉన్నాను. ఇది సీరియస్ సినిమా. ఇలాంటి జోకులు వద్దు అంటూ స్టేజీపై నుంచి విసురుగా వెళ్లిపోయాడు. దీంతో శ్యామల.. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ క్షమాపణలు చెప్పింది.
అయితీ ఈ కార్యక్రమానికి హాజరైన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఆర్జీవీని మెచ్చుకున్నారు. ఈ చిత్రం చూశాక ఆర్జీవీలో మళ్లీ శివ కాలం నాటి డైరెక్టర్‌ను చూశాను అన్నారు. శివ కంటే వందింతలు ఎక్కువగా కనిపించారు అన్నారు విజయేంద్ర ప్రసాద్. అమ్మాయి సినిమా 40 వేల థియేటర్లలో విడుదల అవుతుందంటే తెలుగువారందరికీ గర్వకారణం అన్నారు.