Vijayawada Blade Batch: ఏపీలో ఎన్నికల అనంతరం కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సిట్‌ను నియమించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఏపీలోని హింసాత్మక ఘటనలపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 మంది సభ్యులతో సిట్‌నుఏర్పాటు చేసింది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి వంటి పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై క్షేత్రస్థాయిలో సిట్ దర్యాప్తు చేయనుంది. అల్లర్లపై ప్రాథమిక నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించనుంది. అల్లర్లతో సంబంధమున్న పలు రాజకీయ పార్టీల నేతలను అరెస్ట్ చేసే అవకాశముంది. అలాగే ఈ ఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు పోలీసు అధికారులపైనా చర్యలుతీసుకునే అవకాశముంది.
ఏపీలో అల్లర్లు జరిగిన నేపథ్యంలో విజయవాడలో పెట్రోల్ బంక్‌ల యజమానులకు ఈసీ కీలక ఆదేశాలు జారీచేసింది. బాటిల్స్, టిన్‌లలో పెట్రోలు నింపవద్దని ఆదేశాలిచ్చింది. దీంతో బాటిల్స్‌లో పెట్రోలు నింపేందుకు బంక్ యజమానులు నిరాకరించడంతో బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విజయవాడలోని బ్లేడ్ బ్యాచ్ కొందరు బంక్ యజమానులను, సిబ్బందిని బెదిరిస్తున్నారు. దీంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రివేళ బ్యాచ్‌లుగా వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని పోలీసులు తమకు రక్షణ కల్పించాలని బంక్ యజమానులు కోరుతున్నారు.
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండను నిగ్గుతేల్చే పనిలో సిట్ అధికారులు బిజీగా ఉన్నారు. ఐపీఎస్ అధికారి బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ జెట్ స్పీడ్‌తో దర్యాప్తు చేస్తోంది. రెండు రోజుల్లో ఈసీకి నివేదిక సమర్పించనుంది. దీనికి సంబంధించి డీజీపీతో సిట్ చీఫ్ బ్రిజ్‌లాల్ సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు, ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపై చర్చించారు. ఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పలువురిపై FIRలు నమోదయ్యాయి. కొందరు అరెస్టులు కూడా జరిగాయి. అయితే దర్యాప్తు తీరును సిట్ అధికారులు పరిశీలించనున్నారు. ఘటనలు జరగడంలో పోలీసుల వైఫల్యం ఏమైనా ఉందా.. రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉంది, అటువంటి వారిపై ఎలాంటి కేసులు నమోదు చేశారు వంటి పలు అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగనుంది. విచారణ అనంతరం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.