తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పదేపదే ‘సారు.. కారు.. సర్కార్’ అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయిందని అన్నారు. ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కేసీఆర్ బొమ్మను, కారు గుర్తును, టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థం అవుతోందన్నారు. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని మండిపడ్డారు.
ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కేసీఆర్ రాజకీయ కోణంలో చూసి వాటిని లైట్‌గా తీసుకునే ప్రమాదం ఉందన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా భావిస్తారని, అలాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకుంటూ ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ తీరుపై మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించాలని పిలుపునిచ్చారు. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి తగ్గట్లుగా హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు విజయశాంతి.