ప్రముఖ నటి, కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి.. వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాకు మద్దతు పలికారు. కొత్తగా ఏర్పాటైన జగన్ మంత్రివర్గంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు స్థానం కల్పించకపోవడంపై ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం మీదే టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టిసారిస్తున్నారు. కానీ తెలంగాణకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఆయన దృష్టి పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడిచినా ఇంకా పరిష్కారం కానీ సమస్యలు అనేకం ఉన్నాయి’
‘తెలంగాణలో మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ ఐదేళ్లు గడిపేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడంపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కనీసం ఇది చూసైనా కేసీఆర్ మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా? లేక గత ఐదేళ్ల కాలంలో మహిళా మంత్రులకు స్థానం ఇవ్వకుండా కేబినెట్ కొనసాగించిన పరిస్థితి మళ్లీ పునరావృతం అవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది’
‘ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ కూర్పుపై కూడా నా అభిప్రాయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. మిగిలిన మహిళలకు అవకాశాలు కల్పించడంతో పాటు సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజాకు కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుంది. రాబోయే రోజుల్లోనైనా జగన్.. రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను’ అని విజయశాంతి పేర్కొన్నారు.